ప్రపంచంతో పోటీపడేలా పంటల సాగు: సీఎం కేసీఆర్

214
kcr pragathi bhavan
- Advertisement -

భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయం పరిణితి సాధించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. నిరంతరం మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా, వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా విధంగా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలని చెప్పారు.

ప్రజల అవసరాలు, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణలో జరగాల్సిన పంటల సాగు – అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో నిపుణులతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, అగ్రి బిజినెస్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీమా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీనివాసచారి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సలహాదారు గోపీనాథ్ కోనేటి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కేశవులు తదితరులతో చర్చించారు.

పంటల సాగులో ఏ రకమైన మార్పులు తీసుకురావాలి? ఉత్పాదకత ఎలా పెంచాలి? రైతులు పండించిన పంటను యధావిధిగా మార్కెట్ కు పంపకుండా దానికి వాల్యూ ఆడ్ (అదనపు విలువలను జతచేయడం) చేయడానికి ఇప్పుడున్న పద్ధతులేంటి? కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రపంచం నుంచి పోటీ తట్టుకుని నిలబడేలా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు రావడానికి ఏం చేయాలి? ఎరువులు- రసాయనాల వాడకంలో రావల్సిన మార్పులు ఏంటి? పంటల మిగులు ఉండకుండా ఏం చేయాలి? తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఈ సందర్భంగా నిపుణులు అనేక రకాల సూచనలు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్చలు చాలా జరిపి, తెలంగాణ వ్యవసాయానికి ఒక దశ, దిశను నిర్దేశించాలని నిర్ణయించారు.

‘‘తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉండేది. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల కాస్త ఊరట లభించింది. ఇప్పుడిప్పుడే రైతాంగంలో నమ్మకం ఏర్పడుతున్నది. వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలం పంటతో ప్రారంభమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా రైతుల శ్రేయస్సు కోసమే చేస్తుందనే విశ్వాసం రైతుల్లో ఉంది. సాగునీరు ఉంది. పెట్టుబడి ఉంది. ప్రభుత్వంపై నమ్మకం ఉంది. నైపుణ్యం కలిగిన రైతాంగం ఉంది. ఏ పంటైనా పండించే నేలలున్నాయి. ఇన్ని సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్, అగ్రి ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

‘‘వ్యవసాయాభివృద్ధికి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంభిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రైతులకు కావాల్సినవి సమకూర్చుతున్నాం. దీనివల్ల పంటలు బాగా పండుతున్నాయి. వాటికి కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తున్నం. ఇది సరిపోదు. ఇంకా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెల్లాలి. తెలంగాణలో వ్యవసాయానికి అనుకూతలున్నాయి. ఎక్కువ మంది జనం ఈ రంగంమీదనే ఆధార పడ్డారు. తెలంగాణ జీవికలో వ్యవసాయమే ప్రధానం. కాబట్టి ఎక్కువ దృష్టి వ్యవసాయం మీదనే పెట్టాలి. దీర్ఘకాలిక వ్యూహంతో రైతులకు మార్గదర్శకం చేయాల్సి ఉంది’’ అని సిఎం కేసీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయలు ఇలా ఉన్నాయి:

– రైతులు పండించిన పంటను యధావిధిగా ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్నాము. కానీ ఆ పంటకు వాల్యూ యాడ్ చేయడం వల్ల ఎక్కువ ధర వస్తుంది. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు ఏర్పాటు చేస్తున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కావాల్సిన ముడి సరుకును నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలి. నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్ కు ఓ ఇమేజ్ ఏర్పడుతుంది. అది అంతర్జాతీయంగా మార్కెటింగుకు ఉపయోగపడుతుంది.

– జనాభాలో ఎక్కువ శాతం వ్యవసాయంలోనే ఉండడం ప్రగతికి సంకేతం కాదు. కాబట్టి పారిశ్రామికీకరణ జరగాలి. తెలంగాణ వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు ఎంతో అనుకూలం. కాబట్టి రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలి. దీనివల్ల అటు పారిశ్రామిక రంగం, ఇటు సేవా రంగాలు కూడా విస్తరిస్తాయి.

– ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటలు మార్చుకుని వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం రైతులకు అలవాటు కావాలి. పంటల మార్పిడి విధానం అవలంభించడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. పీడచీడలు తక్కువుగా ఉంటాయి. ఇవన్నీ రైతులకు విడమరిచి చెప్పాలి.

– ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలి. ప్రస్తుతం రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం వ్యాపారుల మాట నమ్మి వాటిని వాడుతున్నారు. తగిన మోతాదులో ఎరువులు, పెస్టిసైడ్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలపాలి. ఎరువులు ఎక్కువ వాడిన పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదనే విషయం కూడా వారికి అర్థమయ్యేట్లు వివరించాలి.

– క్రాప్ కాలనీలు ఉన్నచోటనే ఆ పంటకు సంబంధిచిన అగ్రో ఇండస్ట్రీ/ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ పాల్గొన్నారు.

- Advertisement -