మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. కరోనా కట్టడి, లాక్ డౌన్ అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.రేపు మధ్యాహ్నం 3.00 గంటలకు ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ గతంలో చెప్పినట్టు ఈనెల 17వ తేదీతో లాక్ డౌన్ 3.0 కాలం ముగుస్తుంది. దీంతోపాటు గత కొన్ని రోజులుగా లాక్ డౌన్‌లో కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల వారీగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ఇదే మొదటిసారి.
లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ కొనసాగించాలా? లేకపోతే ప్రస్తుతం ఉన్న దానికి మరికొన్ని మినహాయింపులు ఇవ్వాలా? లేకపోతే మరింత కఠినంగా వ్యవహరించాలా? రాష్ట్రాల్లో పరిస్థితులు ఏంటనే అంశాలపై ప్రధాన మంత్రి ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.