కరోనా కట్టడి కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇన్నోవేటివ్ ప్రయత్నాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని మంత్రి కే. తారకరామారావు ఈరోజు పలువురు వెంచర్ క్యాపిటలిస్టులను కోరారు. ఈరోజు మంత్రి కేటీఆర్ వీడియో కాల్ లో పలు వెంచర్ క్యాపిటల్ లిస్టులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలోని పలువురు వెంచర్ క్యాపిటల్ లిస్టులు కలిసి అక్ట్ గ్రాంట్స్ ( ACT GRANTS) పేరిట సుమారు వంద కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, భారతదేశ స్టార్ట్ అప్ కమ్యూనిటీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సరికొత్త ఐడియాలతో కోవిడ్ 19ను ఎదుర్కునేందుకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మరియు కలారి క్యాపిటల్ యండి వాణి కోలా బెంగళూరు నుంచి ఈ విడియో సమావేశాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు ఈ విడియో సమావేశంలో పాల్గోన్నారు. ఆక్ట్ గ్రాంట్స్ ద్వారా కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు వినూత్నమైనటువంటి ఆలోచనలకు, ప్రయత్నాలకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.
ప్రపంచ మహమ్మారి ఎదుర్కొంటున్న కాలంలోనూ అనేక సమస్యలతో పాటు అనేక అవకాశాలను ప్రస్తుత పరిస్థితులు కల్పిస్తున్నాయని, ఇందులోని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. ముఖ్యంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ డివైస్, జినోమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కరోనా పలు అవకాశాలను ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న మెడికల్ డివైసెస్ స్థానంలో ఇక్కడి అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందించే కార్యక్రమాన్ని ఇప్పటికే పలువురు చేపట్టారని, ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టివర్క్స్ అతి తక్కువ ఖర్చుతో ఒక వెంటిలేటర్ ను తయారు చేసిందని, ఇలాంటి ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తే, తక్కువ ఖర్చుతో నాణ్యమైన మెడికల్ డివైస్ ని మనం తయారుచేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. కరోనా కట్టడి కోసం ముందుకు వచ్చే స్టార్ట్ అప్ కంపెనీలకు తమ ప్రభుత్వ మద్దతు కోనసాగుందని, ఇందుకోసం అవసరం అయితే టి హబ్, విహబ్, టి వర్క్స్, రిచ్ (RICH),తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వంటి సంస్ధల సహాకారం తీసుకోవాలని సూచించారు.
ప్రపంచం కరోనా వైరస్ కట్టడి అనేక కార్యక్రమాలను చేపట్టిందని దేశంలోని ప్రజలు ఇందులోనూ వినూత్నమైన అలోచనలు చేస్తున్నారన్నారు. వైరస్ ని ఎదుర్కోవడంలో షాపుల ముందు తెల్లని గీతలు ఎర్పాటు చేయడం నుంచి మొదలు, రైల్వే కోచ్ లను అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్ గా మార్చడం వరకు వినూత్నమైన ఆలోచనలతో భారతదేశం ముందుకు పోతున్నదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైరస్ కట్టడి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారని, తాము సైతం ఇలాంటి ఆలోచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే బయో టెక్నాలజీ రంగంలో కిరణ్ మజూందార్ షా వంటి వారి సలహాలు సూచనలను పరిశీలించమన్నారు. కరోనా కోసం వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు 6 బయోటెక్ కంపెనీలు ముందువరుసలో ఉన్నాయని, ఇందులో ఐదు తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నాయన్నారు.
ఇప్పటికీ కరోనాకి ఎలాంటి మందు లేని నేపథ్యంలో ఇన్నోవేషన్ ద్వారానే దానిని ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ప్రస్తుత లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగాలు తమ ప్రాధాన్యతలను పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఇందుకోసం సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.