తెలంగాణలో తగ్గనున్న ఫోన్ల ధరలు…

209
TS Govt reducation in VAT to 5 per cent
- Advertisement -

మొబైల్ యూజర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురునందించింది. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. దీంతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు…మొబైల్‌ ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) తగ్గిస్తూ టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది.

స‌భ‌లో బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్‌) సవరణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం ఈ బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని మాట్లాడుతూ… నోట్ల రద్దు నేప‌థ్యంలో న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్సహించడం కోసం సెల్‌ఫోన్లపై వ్యాట్ తగ్గింపు బిల్లును తీసుకొచ్చామ‌ని తెలిపారు. దీంతో మొబైల్ ఫోన్లపై 14.5 శాతం ఉన్న వ్యాట్ 5 శాతానికి తగ్గిందని చెప్పారు. డిజిట‌లైజేష‌న్‌ అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని త‌మ స‌ర్కారు కృషి చేస్తోంద‌ని చెప్పారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ వ్యాట్ తగ్గింపు బిల్లును విపక్షాలు స్వాగతించాయి.దీంతో తెలంగాణలో సెల్‌ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిన సెల్‌ ఫోన్‌ సంస్థలు వ్యాట్‌ తగ్గించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం మొబైల్‌ తయారీ కంపెనీలకు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయంపై సెల్‌ ఫోన్‌ కంపెనీలు, డీలర్లు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -