ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ఉన్న కూడా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా రోడ్డపైకి వస్తున్నారు. కారోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా కరోనాపై పోలీసులు, వైద్య సిబ్బంది, ఇతరులు ప్రజలకు పలు సూచనలు, సలహాలిస్తున్నారు. అయితే దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెన్నైలో పోలీసులు సరికొత్త పద్దతిని ఎంచుకున్నారు.
చెన్నై పోలీసులు వెరైటీగా కరోనా హెల్మెట్‌ను ధరించారు. కరోనా వైరస్‌లో ఉండే స్పైక్ ప్రోటీన్ తరహాలో హెల్మెట్‌ను రూపొందించారు. రోడ్డుపైకి వస్తున్న వాహనదారులకు వారు కరోనా ప్రభావాల గురించి తెలియజేస్తున్నారు. గౌతమ్ అనే ఆర్టిస్ట్ ఈ హెల్మెట్‌ను తయారు చేసి పోలీసులకు ఇచ్చాడు. పాడైపోయిన హెల్మెట్‌కు పేపర్లతో కరోనా లుక్‌ను తీసుకువచ్చాడు. తమిళనాడులో పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం మంచి సత్ఫలితాలు ఇస్తోంది. జనాల్లో అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నామని పోలీసులు చెబుతున్నారు.