అధిక ధరలకు పాలు విక్రయిస్తే కఠినచర్యలు: తలసాని

247
Minister Talasani Srinivas
- Advertisement -

అధిక ధరలకు పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలకు నిత్యావసర వస్తువైన పాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఇవాళ తన కార్యాలయంలో వివిధ డెయిరీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన తలసాని ….కరోనా నేపథ్యంలో డోర్ డెలివరీ సక్రమంగా జరగకపోవడంతో స్విగ్గి, బిగ్ బాస్కెట్ ల ద్వారా పాల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుత సమయంలో పాల సరఫరాలో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పాల సరఫరా చేసే సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించేలా డెయిరీల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాల సరఫరా లో ఏమైనా సమస్యలు ఏర్పడితే కంట్రోల్ రూమ్ (040-23450624) కు సమాచారం అందించాలన్నారు.

పశువుల దాణా, పశుగ్రాసాన్ని అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పంపిణీ దారుల గోదాములపై తనిఖీ నిర్వహించి అక్రమ నిల్వలతో కొరత సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలలన్నారు. పశుగ్రాసం అందుబాటులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈసమీక్షా సమావేశంలో విజయ డెయిరీ, హెరిటేజ్, జెర్సీ, దొడ్ల, కరీంనగర్, మస్కటి, అమూల్, నార్మూల్, తిరుమల, ముకుంద డెయిరీల ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -