కరీంనగర్ ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇండోనేషియా నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ ఉదయం నుంచే కలెక్టరేట్ పరిధి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నట్టు గుర్తించామని.. ఆ సమయంలో సంచరించిన ప్రాంతాలను, కలిసిన వ్యక్తులను గుర్తించామని గంగుల వెల్లడించారు. కలెక్టరేట్ పరిధిలోని ఓ ప్రార్థనామందిరంలో గడిపినట్టు గుర్తించామన్నారు.
ప్రజలు నాలుగురోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇండ్లనుంచి బయటకు రావద్దని కోరారు. జిల్లాకేంద్రంలో 20 ఐసొలేషన్, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటుచేశామని, రెండు ప్రైవేటు దవాఖానలు ప్రతిమ, చల్మెడ వైద్యశాలల్ల్లో 50 చొప్పున బెడ్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. కరీంనగర్ నగరమంతటా శానిటైజేషన్ చేస్తున్నామని, జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను గుమికూడవద్దని ప్రచారంచేస్తున్నామన్నారు.