టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విద్వత్సభ ఆద్వర్యంలో నిర్వహించిన నవతివర్ష (90) శ్రీ శార్వరి పంచాంగ ఆవిష్కరణోత్సవంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గాడిచెర్ల నాగేశ్వర రావు సిధ్దాంతి రచించిన నవతివర్ష (90) శ్రీ శార్వరి పంచాంగాన్ని వీరు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ వర్గాల శ్రేయస్సు కోసం రూ. 100 కోట్ల నిధితో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రాంతం ఎంతో మంది పండితులు, సిద్ధాంతులకు నిలయమన్నారు. వందలాది సంవత్సరాల నుంచే పంచాంగ గణన చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాడ్డాక పండితులు, సిధ్దాంతులు అందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ విద్వత్సభ ఏర్పాటు చేసుకోవడం ముదావాహం, ప్రశంసనీయమన్నారు. విద్వత్సభ ఆద్వర్యంలో పండగలపై ఏకాభిప్రాయంతో ఒకే పంచాగాన్ని రూపొందించడం ప్రభుత్వానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు.
ఈ ఏడాది జూలై 11,12 న జరిగే నాల్గవ రాష్ట్ర స్థాయి జ్యోతిష్య మహాసభలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సాకారాలు అందిస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి మరుమాముల వెంకట రమణ శర్మ, గౌరవ సలహాదారులు గాయత్రి తత్త్వానంద రుషి, హనుమంతా చారి, తదితరులు పాల్గొన్నారు.