ట్రాఫిక్ సిగ్న‌ల్ వ్య‌వ‌స్థపై లోకేష్ కుమార్‌ రివ్యూ..

555
ghmc
- Advertisement -

మెట్రో రైలు మార్గంతో పాటు జె.బి.ఎస్ నుండి వ‌యా యం.జి.బి.ఎస్ మీదుగా ఫ‌ల‌క్‌నూమా వ‌ర‌కు ట్రాఫిక్ సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను సింక్ర‌నైజేష‌న్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ తెలిపారు. బుధ‌వారం జిహెచ్ఎంసి కార్యాల‌యంలో ట్రాఫిక్ సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌పై నిర్వ‌హించిన స‌మీక్ష‌లో మాట్లాడుతూ రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించి, జిహెచ్ఎంసి ఆస్తుల‌కు, సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌కు జ‌రుగుతున్న న‌ష్టాల‌ను నివారించుట‌కై ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన వాహ‌న‌దారుల‌పై గ‌రిష్ట స్థాయిలో జ‌రిమానాలు విధించుట‌కై జిహెచ్ఎంసి చ‌ట్టంలో మార్పుల‌కై ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు తెలిపారు.

ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో దాదాపు రూ. 1 కోటి 10 ల‌క్ష‌ల ఆస్తుల‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. రోడ్లు, ప‌బ్లిక్ ప్ర‌దేశాలు, పార్కుల‌లో మ‌ద్యం తాగిన వ్య‌క్తుల వాహ‌నాల‌ను సీజ్‌చేసి భారీ ఎత్తున జ‌రిమానా విధించాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధ‌న‌ల అమ‌లుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. ఇత‌ర దేశాల్లో ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినవారిపై జీరో టోల‌రెన్స్ ఉంటుంద‌ని తెలిపారు.

క్షేత్ర‌స్థాయిలో ట్రాఫిక్ ర‌ద్దీని మొబైల్ డ్యాష్ బోర్డు ద్వారా మానిట‌రింగ్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం జిహెచ్ఎంసి ప‌రిధిలో నెల‌కోల్పిన 221 ట్రాఫిక్ జంక్ష‌న్ల నిర్వ‌హ‌ణ‌తో పాటు మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో కొత్త‌గా 155 ట్రాఫిక్‌ జంక్షన్లు, 98 చోట్ల కొత్త‌గా పెలికాన్‌ సిగ్న‌ల్స్ నెల‌కోల్ప‌నున్న‌ట్లు తెలిపారు. కొత్త జంక్ష‌న్లు, పెలికాన్ సిగ్న‌ళ్ల టెండ‌రింగ్‌, ఎగ్రిమెంట్ నిబంధ‌న‌ల‌ను భ‌విష్య‌త్‌లో వాటి నిర్వ‌హ‌ణ‌కు న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా రూపొందించాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న 221 ట్రాఫిక్ సిగ్న‌ళ్ల‌లో 58 చోట్ల స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డం లేద‌ని, ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పున‌రుద్ద‌రించేందుకు సంబంధిత ఏజెన్సీకి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. కొత్త సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను ఎగ్రిమెంట్ అనంత‌రం మూడు నెల‌లోపు నెల‌కోల్పాల‌ని తెలిపారు. జాప్యం జ‌రిగిన‌ట్లైతే బిల్లులో కోత విధించ‌నున్న‌ట్లు తెలిపారు. మూడో పార్టి నాణ్య‌త ప‌రీక్ష‌ల అనంత‌రమే చెల్లింపులు జ‌రుప‌నున్న‌ట్లు తెలిపారు. మ‌ల్టీలేవ‌ల్ కారు పార్కింగ్ స‌దుపాయాల‌ను క‌ల్పించుట‌కై ప్ర‌తిపాద‌న‌లు చేయాల‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో జిహెచ్ఎంసి చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఎల‌క్ట్రిక‌ల్ జె.శంక‌ర‌య్య‌, ఎస్‌.ఇ. ఎల‌క్ట్రిక‌ల్ శ్రీనివాస్‌, రాచ‌కొండ‌ ట్రాఫిక్ డి.సి.పి ఎన్‌.దివ్య చ‌ర‌ణ్‌రావు, ట్రాఫిక్ అడిష‌న‌ల్ డి.సి.పి పి.క‌రుణాక‌ర్‌, ఎస్‌.ఇ. కృష్ణ‌, ఎస్‌.ఇ. ప్రాజెక్ట్స్ జి.శ్రీల‌క్ష్మి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్లు ఎస్ ప్ర‌దీప్‌, కె.బాల్‌రాజ్‌, ఎం.న‌ర్సింగ‌రావు, జె.నిరంజ‌న్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ghmc lokesh kumar review on Hyderabad traffic signals system. ghmc lokesh kumar review on Hyderabad traffic signals system.

- Advertisement -