కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
గతంలో సోనియా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధికి గానూ అమెరికాలో చికిత్స తీసుకుని వచ్చారు. అనంతరం యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె కిందపడి గాయమైంది. జ్వరం, డీహైడ్రేషన్, భుజం నొప్పి కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరారు సోనియా. కాగా, కూతురు ప్రియాంక వాద్రా కుటుంబంతో కలిసి షిమ్లాకు వెళ్లిన సోనియా.. గత వారమే ఢిల్లీకి తిరిగొచ్చారు. ప్రస్తుతం సోనియాకు వైద్య పరీక్షలు కొనసాగుతుండగా.. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యులు చెబుతున్నట్టుగా సమాచారం. కాగా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆనారోగ్యం కారణంగానే హాజరు కాలేదని తెలుస్తోంది.