దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నపుడు నిరుపేదలుగా ఉన్న వారు.. రాత్రికిరాత్రే కోటీశ్వరులై పోతున్నారు. అలాగే, నల్లకోటీశ్వలు పేదలుగా మారిపోతున్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్లలో డబ్బుభారీగా చేరుతోంది. తాజాగా పంజాబ్‌లో ఏకంగా ఓ ట్యాక్సీ డ్రైవర్ అకౌంట్‌లో ఏకంగా రూ.9806 కోట్లు జమ అయ్యాయి. దీంతో సదరు అకౌంట్ వ్యక్తి షాక్ తిన్నాడు.
వివరాల్లోకి వెళ్తె…పేరు బల్వీందర్ సింగ్. ఓ టాక్సీ డ్రైవర్. పంజాబ్‌లో నివశిస్తున్నాడు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో అతడికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఒక ఖాతా ఉంది. ఈనెల 4వ తేదీన ఉన్నట్టుండి అతడి ఖాతాలోకి దాదాపు 9806 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇంత స్థాయిలో తన ఖాతాలోకి డబ్బులు రావడం ఏంటని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
తన సెల్‌ఫోనుకు వచ్చిన ఎస్ఎంఎస్‌ను పదే పదే చూసుకుని మురిసిపోయాడు. కానీ, అతడి సంతోషం గట్టిగా రెండు రోజులు కూడా ఉండలేదు. ఆ మొత్తం డబ్బంతా మర్నాడే ఖాతాలోంచి వెళ్లిపోయింది. అసలు ఆ డబ్బు ఎవరిది, ఎలా వచ్చింది, తన ఖాతాలోంచి తాను సంతకం పెట్టకుండా ఎలా వెళ్లిపోయిందని అతడు తల బద్దలుకొట్టుకున్నాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎవరైనా నల్లధనాన్ని మార్చుకోడానికి వేసుకున్నారా అని కూడా అనుమానం వచ్చింది. ఇదే విషయం గురించి బ్యాంకు అధికారులను కూడా చాలాసార్లు అడిగాడు. కానీ ఫలితం లేదు. పైగా.. తన పాస్‌బుక్‌ను వాళ్లు నవంబర్ 7వ తేదీన తీసుకుని వాళ్ల దగ్గరే ఉంచుకున్నారని, తర్వాత కొత్త పాస్‌బుక్ ఇచ్చారు గానీ, అందులో ఈ 9806 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంట్రీ లేదని బల్వీందర్ చెప్పాడు.
దీనిపై బ్యాంకు అధికారులు వివరణ ఇచ్చారు. బల్వీందర్ అకౌంటులోకి రూ. 200 క్రెడిట్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ మేనేజర్ పొరపాటున బ్యాంకుకు చెందిన 11 అంకెల ఇంటర్నల్ బ్యాంకింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటు నంబర్ కూడా వేసేశారని, అందువల్ల ఆ మొత్తం వచ్చినట్లు కనిపించిందని చెప్పారు. మర్నాడు ఈ తప్పును తెలుసుకుని మళ్లీ సరిచేశామని తెలిపారు.