ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే.. తన తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు కూతురు పడ్డ కష్టమే ఈ చిత్ర కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే క్రికెట్ నేపథ్యంలో ఇదివరకే ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ.. ఇందులో రైతుల అంశాన్ని కూడా టచ్ చేసినట్లు కనపడుతోంది. ‘నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు.. నిన్ను’ , ‘ఈ లోకం.. గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాడు చెబితే వింటుంది. ఏం చెప్పినా గెలిచి చెప్పు’లాంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. శివ కార్తీకేయన్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించారు.