దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. రోజువారి కొత్త కేసుల పెరుగుదలతో పాటు మరణాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. గడిచి 24 గంటల్లో 93,249 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా.. 513 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509కు పెరిగింది. 24 గంటల్లో 60,048 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,16,29,289 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,64,623కు పెరగ్గా.. ప్రస్తుతం దేశంలో 6,91,597 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. టీకా డైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 7,59,79,651 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ఇక గత సంవత్సరం సెప్టెంబర్ 19 తరువాత నిన్న అత్యధిక కేసులు వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ 17న 98,795 కొత్త కేసులు రాగా, ఇప్పటివరకూ అదే రోజువారీ రికార్డు. మరణాల విషయానికి వస్తే, డిసెంబర్ 4న 514 మంది కరోనాతో మరణించగా, నిన్న 500 మంది కన్నుమూశారు. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో శనివారం నాడు 49,447 కేసులు రావడం గమనార్హం. మహారాష్ట్రతో పాటు హర్యానా, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.