తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలోని రీడింగ్ నగరంలోని టాక్ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి మువన్నెల పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ భారతీయుడికి 75 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించుకునే క్రమంలో మన పూర్వీకులు అనేక పోరాటాలు చేసారని. ఎందరో దేశభక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారని. అలాగే ఈ పోరాటంలో ఎందరో వీరనారీమణులు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు.
చాలా మంది నాయకులు సాధారణ జనాల్లో దేశభక్తిని నింపి, వారిని ఉద్యమాల్లో పాల్గొనేలా చేశారని. ఈ సంగ్రామంలో దేశం నలుమూల నుండి అనేకమంది గొప్ప నాయకులు పాల్గొన్నారని తెలిపారు. వీరు ఎంచుకున్న విధానాలు వేరు అయినప్పటికీ, వీరి గమ్యం మాత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడమేనని అన్నారు. ఈ పోరాటాల్లో కొన్ని లక్షలమంది, దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారని వారి త్యాగాలని స్మరించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని. ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతని శుషుమ్నా రెడ్డి తెలిపారు.
ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ.. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలని. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో, ఆ కలలను మనమందరం సాకారం చేయాలని. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మన బాధ్యత అని అందరికీ గుర్తు చేస్తున్నట్టు సురేష్ బుడగం తెలిపారు.
కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్మన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. అహింసా మార్గాన్ని ఎంచుకొని గాంధీజీ ఎలాగైతే స్వాతంత్య్రాన్ని సాధించారో అదే బాటలో నడిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్ర ఆవిర్భావంతో పల్లెలు పట్టణాలు ప్రగతి పథంలో ముందుకు నడుస్తున్నాయన్నారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది బంగారు తెలంగాణగా మారుతుందని, అనేక రాష్ట్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు కాపీ కొడుతున్నారని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ పరిస్థితి ప్రస్తుత తెలంగాణ పరిస్థితి మధ్య చాలా వ్యత్యాసం ఉందని.. తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
ఈ వేడుకల నిర్వహణ బాధ్యతలు తీసుకొని ఘనంగా నిర్వహించిన ఈవెంట్స్ కార్యదర్శి మల్లా రెడ్డి బీరంను టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు -శుష్మున రెడ్డి,ప్రధాన కార్యదర్శి-సురేష్ బుడగం,మాజీ అధ్యక్షురాలు-పవిత్రారెడ్డి కంది, సలహా మండలి వైస్ చైర్మన్-సత్యం రెడ్డి కంది, కమ్యూనిటీ వ్యవహారాల చైర్‌పర్సన్-నవీన్ రెడ్డి,రవి రెటినేని,మల్లా రెడ్డి,భూషణ్,మౌనికా, కె.వి.ప్రసాద్,అవినాష్ కవ్వా,శ్రుజన రాచెర్లా,పృథ్వీ రావుల,శశిధర్ రెడ్డి, మాధవి, నరేష్, వీర్ నాయుడు, సుభాష్, ధర్మేంద్ర, నాగార్జున, అనిల్ రాజ్ దుబ్బా, మేరీ, నరేందర్ జక్కుల తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.