బిహార్‌లోని సీతామర్హీ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు వేగంగా పెరుగుతుండటం కలకలం రేపింది. జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్టీ (ART) సెంటర్ డేటా ప్రకారం, ఇప్పటివరకు 7,400 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులు నమోదు అయ్యారు. వీరిలో 400 మందికి పైగా పిల్లలు తమ తల్లిదండ్రుల ద్వారా—పుట్టుక సమయంలోనే—వైరస్ బారినపడ్డారని సమాచారం.
ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు హెచ్‌ఐవీతో బాధపడుతున్నారన్న విషయం ఆరోగ్య కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులు హెచ్‌ఐవీతో బాధపడుతున్న కుటుంబాల్లోనే అధికంగా ఈ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజల్లో హెచ్‌ఐవీపై అవగాహన చాలా తక్కువగా ఉందని చెప్పారు. నెలకు 40–60 కొత్త కేసులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం 5,000 మంది రోగులకు మందులు అందజేస్తున్నామని వివరించారు. సీతామర్హీ ఇప్పుడు హై-లోడ్ హెచ్‌ఐవీ సెంటర్‌గా మారింది…అత్యంత ఆందోళనకరం అని డాక్టర్లు చెబుతున్నారు.
వివాహాల సమయంలో ఆరోగ్య పరీక్షలు చేయకపోవడం, ఉపాధి కోసం దీర్ఘకాల వలసలు, హెచ్‌ఐవీ సంక్రమణపై అవగాహన లేకపోవడం, సామాజిక ముద్ర కారణంగా పరీక్షలు చేయించుకోవడంలో మొహమాటం వంటి అంశాలే కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా పరిపాలన అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తోంది. ఏఆర్టీ సెంటర్ కొత్త కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో హెచ్‌ఐవీ పరీక్ష శిబిరాలు నిర్వహించేందుకు ఆరోగ్య బృందాలు సిద్ధమవుతున్నాయి. ప్రజా అవగాహన కార్యక్రమాలు, నిరంతర పరీక్షలు పెంచకపోతే, సీతామర్హీలో హెచ్‌ఐవీ కేసులు రాబోయే నెలల్లో మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read:ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్

