నిత్య కల్యాణం… పచ్చ తోరణంలా కళకళలాడే భక్తజనం…భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి – బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామి గాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠ వాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం. అదే తిరువేంకటనగరి తిరుపతి. శ్రీనివాసుడు తిరుమలను తన ఆవాసంగా మలచుకుని భక్తజనవరదుడిగా మారి ఐదువేల సంవత్సరాలయింది.
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర. శ్రీవారిని ఎందరో రాజులు భక్తిప్రపత్తులతో పూజించారు. తిరుమలలో కొన్ని వందల సంవత్సరాల కిందటి కట్టడాలున్నాయి.
సప్త గిరులు.ఈ పేరు వింటేనే భక్తజనుల ఒళ్లు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది.అలాంటి ప్రాముఖ్యత గల తిరుమల కొండలకు 150 కోట్ల ఏళ్ళ చరిత్ర ఉందని అంటున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా నిపుణులకు లభ్యమయ్యాయి.
పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది.వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే… భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు. నంది వృషబాధ్రి అయ్యాడు, హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు.
స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల… నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవచేస్తున్నాడు. ఇక నారాయణాద్రి,వెంకటాద్రిలు శ్రీవారి రూపాలే. ఈ రెండు కొండలు జయ, విజయులకు ప్రతిరూపాలు అంటారు.
శ్రీమన్నారాయణుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. ఆయన లేని చోటంటూ లేదు. ప్రశాంత వాతావరణం కోసం అప్పుడప్పుడు శ్రీవారు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరి వల్ల సాధ్యం కాదని శ్రీరాముడు వానరులకు తెలిపారు. పురాణాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అందుకే తిరుమల గిరుల ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు.