దండం పెట్టి మరీ ఓటు వేశాడు..!

215
kishor goud
- Advertisement -

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు భారీగా కదిలిరావడంతో అంచనాలకు మించి రికార్డుస్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 76.35%, మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 72.45% పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఆయా జిల్లాల పరిధిలోని పలువురు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల ముఖ్య నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌ బంక్‌ సందడి చేశాయి! పెట్రోల్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు ఓటర్లు నిరసనగా పెట్రోల్‌ బంక్‌కు దండం పెట్టి ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీకీ చెందిన కిషోర్‌ గౌడ్‌ ఓటును వేసేందుకు వెళ్లుతూ మార్గం మధ్యలో ఓ పెట్రోల్‌ పంప్‌కు దండం పెట్టి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

అలాగే హైదరాబాద్‌లోని షేక్‌పేట తాసిల్దార్‌ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన మంత్రి కేటీఆర్‌.. ‘ఓ మహానుభావుడు చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని, ఓటు వేసేందుకు బయలుదేరే ముందు మా ఇంట్లో సిలిండర్‌కు దండం పెట్టుకొని వచ్చాను’ అని చెప్పడం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అనేకమంది పట్టభద్రులు సిలిండర్‌, పెట్రోల్‌ బంక్‌కు దండాలు పెట్టుకొని వచ్చి ఓటు వేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -