వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

487
Yadadri Brahmotsavam
- Advertisement -

ఈరోజు నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. ప్రస్తుతం అత్యంత భారీస్థాయిలో పునర్నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రి క్షేత్రంలో ప్రధాన ఆలయం పునర్మిర్మాణంలో ఉన్నందున కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పదకొండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు ఈరోజు నుండి మొదలై 25న ముగుస్తాయి.

భక్తోత్సవాల పేరిట వేడుకలు జరపడం యాదగిరిగుట్టపై కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. తొలుత మూడురోజులూ ఆ తర్వాత ఐదు రోజులూ జరిగిన ఈ ఉత్సవాలు చివరికి 11రోజుల బ్రహ్మోత్సవాలుగా రూపుదాల్చాయి. 1975 నుంచి ఈ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. వైష్ణవాలయాల్లో స్వామివారి నిత్యకైంకర్యాలకూ ఉత్సవాలకూ ఎంత ప్రాధాన్యం ఉంటుందో దేవేరులతో కూడిన స్వామిని అలంకరించడానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని రోజుకో రూపంలో అలంకరించి చూసుకుంటారు భక్తులు.

పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరిగే ఈ ఉత్సవాలు విష్వక్సేనుడి పూజతో మొదలై అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగుస్తాయి. ఉత్సవాలు నిరాటంకంగా జరిగేలా చూడమంటూ సేనాధిపతి విష్వక్సేనుడిని పూజిస్తారు. రెండో రోజు ధ్వజారోహణమూ రాత్రి భేరీపూజ, మూడోరోజు వేదపారాయణ, నాలుగోరోజు హంసవాహనసేవ, ఐదో రోజు కల్పవృక్ష సేవ, ఆరో రోజున గోవర్ధన గిరి అవతారం, ఏడో రోజున స్వామివారి కల్యాణానికి ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున జరిగే స్వామివారి కల్యాణం చూడడానికి రెండు కళ్లూ చాలవు. తొమ్మిదో రోజు వైభవంగా రథోత్సవం, పదో రోజున చక్రస్నానం, చివరి రోజున అష్టోత్తర శతఘటాభిషేకం.. నిర్వహిస్తారు.

- Advertisement -