చిన్నారి లేఖకు స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..

152
- Advertisement -

5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని లేఖకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బదులిచ్చారు. దేశంలో పరిస్థితులు, న్యాయస్థానాల పని తీరును అవగాహన చేసుకున్న ఆ చిన్నారి.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాసింది. న్యాయస్థానం విధి నిర్వహణను వివరించే చిత్రాన్ని లేఖతోపాటు జత చేసింది. సమాజం పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధను మెచ్చుకుంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెకు ఓ లేఖను రాయడంతోపాటు ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని బహూకరించారు.

త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న లిడ్వినా జోసఫ్ ఈ లేఖ రాసింది. ఓ ప్రముఖ పత్రికలో భారత దేశంలోని ప్రధాన వార్తలను చదివానని, కరోనా వైరస్ వల్ల ఢిల్లీలోనూ, మిగతా చోట్ల సంభవిస్తున్న మరణాల పట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సామాన్యుల బాధలు, మరణాలపట్ల న్యాయస్థానం సమర్థవంతంగా స్పందిస్తున్నట్లు తనకు వార్తా పత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించి, చాలా మంది ప్రాణాలను కాపాడినందుకు తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపింది. దేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో, కోవిడ్-19 మహమ్మారిని, దానికి సంబంధించిన మరణాలను తగ్గించడంలో న్యాయస్థానం సమగ్ర చర్యలు తీసుకుందని పేర్కొంది. ఇందుకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణకు ధన్యవాదాలు చెప్పింది. ఈ లేఖతోపాటు లిడ్వినా ఓ వర్ణ రంజితమైన చిత్రాన్ని జత చేసింది. దీనిలో న్యాయమూర్తి తన ముందు ఉన్న బల్లపై ఉన్న కరోనా వైరస్‌ను తన చేతిలోని సుత్తితో పారదోలుతున్నట్లు ఉంది.

- Advertisement -