ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ‘డేరా సచ్చా సౌదా’ (DSS) అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యానా ప్రభుత్వం మంగళవారం మరోసారి 30 రోజుల పరోల్ మంజూరు చేసింది. ఈ పరోల్ లభించడంతో ఆయన రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుండి మంగళవారం ఉదయం విడుదలయ్యారు.
ఆగస్టు 2017లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేసిన తర్వాత, జైలు నిర్బంధం నుండి ఆయన పెరోల్ పై తాత్కాలికంగా బయటకు రావడం ఇది 16వ సారి.పెరోల్ కాలంలో ఆయన సిర్సాలోనే బస చేయనున్నారు. అయితే ఆయన తన అనుచరులను లేదా భక్తులను ప్రత్యక్షంగా సమావేశ పరచడానికి అనుమతి లేదు. కానీ వర్చువల్ ద్వారా వారితో మాట్లాడవచ్చు.
2026 సంవత్సరంలో రామ్ రహీమ్ సింగ్ జైలు నుండి విడుదల కావడం ఇది రెండోసారి. అంతకుముందు ఇదే ఏడాది జనవరిలో ఆయనకు ప్రభుత్వం 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీకి ఏడాదికి గరిష్టంగా 70 రోజుల పరోల్ లభిస్తుంది. తాజా 30 రోజుల పరోల్‌తో రామ్ రహీమ్ ఈ ఏడాదికి తనకు ఉన్న మొత్తం పరోల్ పరిమితిని పూర్తి చేసుకున్నారు. ఇక ఆయనకు కేవలం 21 రోజుల సెలవు మాత్రమే మిగిలి ఉంది. జూన్ 24న ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
Also Read:కార్తి బర్త్ డే..కొత్త సినిమా ప్రకటన
2017లో అత్యాచార కేసులో దోషిగా తేలిన తర్వాత రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ సమయంలో ఆయన అరెస్టుకు నిరసనగా అనుచరులు చేసిన అల్లర్లలో 40 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత పీర్ రంజిత్ సింగ్ హత్య కేసు, జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసుల్లో కూడా ఆయనకు కోర్టులు శిక్షలు వేసినప్పటికీ, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇటీవల ఆయా హత్య కేసుల నుండి ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ విముక్తి కల్పించింది. ప్రస్తుతం ఆయన కేవలం అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్నారు.

