మా రేవంత్ వడ్లు కొనట్లేదు:కోమటిరెడ్డి

6
- Advertisement -

రాష్ట్రంలో ధాన్యం (వడ్ల) కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగడం లేదని అంగీకరిస్తూ ఆయన రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేటు గోదామును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ ఉంచిన ధాన్యాన్ని, కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్వపక్ష ప్రభుత్వంపైనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వడ్లు కొనట్లేదనేది నిజమే. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నేను కాదనడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర ఆలస్యం జరుగుతుండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను తాము కళ్లారా చూస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు, అవి నూటికి నూరు శాతం వాస్తవం. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైన విషయంపై మేం కూడా తీవ్రంగా చింతిస్తున్నాం. సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేయనందుకు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రైతాంగాన్ని క్షమించమని కోరుతున్నాను అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read:కార్తి బర్త్ డే..కొత్త సినిమా ప్రకటన

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి రోజులు గడుస్తున్నా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

- Advertisement -