దేశంలో తొలిసారి 3 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్‌..

69

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 32 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 కేసులు ముంబయిలోనూ, 4 కేసులు పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ వెలుగు చూశాయి. ఇందులో దేశంలోనే తొలిసారిగా మూడున్నరేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 17కి చేరింది. కాగా, ముంబయిలో నేడు ఒమిక్రాన్ నిర్ధారణ అయిన ముగ్గురూ పురుషులే కాగా, వారు టాంజానియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు గుర్తించారు. పింప్రి చించివాడ్ లో ఒమిక్రాన్ పాజిటివ్ నైజీరియా మహిళను కలిసిన నలుగురు ఒమిక్రాన్ బారినపడినట్టు వెల్లడైంది.

కరోనా రెండో వేవ్‌లో పెద్దలతోపాటు యువతనూ పెద్ద సంఖ్యలో పొట్టనపెట్టుకున్న డెల్టా వైరస్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వాయువేగంతో వ్యాపిస్తుండటం, దాని వల్ల చిన్నపిల్లలూ తీవ్రంగా ప్రభావితం అవుతారనే అంచనాలు, కొత్త వేరియంట్ వల్ల భారత్‌లో ఫిబ్రవరి నాటికి కచ్చితంగా మూడో వేవ్ తలెత్తుతుందనే హెచ్చరికల నేపథ్యంలో భయాందోళనలు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఒక ఎత్తయితే, మూడున్నరేళ్ల చిన్నారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.