2జీలో స్కాం లేదు.. అంతా నిర్దోషులే

254
2G Spectrum Scam Verdict : All 17 Accused
- Advertisement -

యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రం(స్కాం) కేసులో పాటియాలా ప్రత్యేక కోర్టు  కీలక తీర్పు వెలువరించింది. డీఎంకే సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, రాజ్యసభ సభ్యురాలు,కరుణానిధి కూతురు కనిమొళితో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది.

2జీ స్పెక్ట్రం కేసులో సీబీఐ కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించిందని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అన్నారు. డీఎంకేకు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం జరిగిందని…కానీ కోర్టు తీర్పుతో అవి పటాపంచలయ్యాయని తెలిపారు. కోర్టు తీర్పుతో ఆరోపణలు నిజం కావని అర్దమైందని మాజీ మంత్రి చిదంబరం అన్నారు. ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని సూచించారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో డీఎంకేకు చెందిన ఎ.రాజా టెలికంశాఖ మంత్రిగా ఉన్నారు. 2జీ మొబైల్ ఎయిర్ వేవ్స్, ఆపరేటింగ్ లైసెన్సులను టెలికాం సంస్థలకు కేటాయించడంలో ఎ.రాజా పక్షపాతంతో వ్యవహరించారడంతో ప్రభుత్వానికి రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్‌ పేర్కొంది. స్వాన్  టెలికం సంస్థకు  2G  స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా కలైంజర్  టీవీ, టీపీ గ్రూపు సంస్థలకు 2వందల కోట్లు లంచం తీసుకున్నారని తెలిపింది.

కాగ్‌ ఆరోపణలతో 2010లో ఎ. రాజాను కాంగ్రెస్‌  పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్‌ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ఇక 2014 ఏప్రిల్ నెలలో ఈడీ మరో కేసు పెట్టి, అందులో రాజా, కనిమొళి సహా మరికొంత మందిపై అభియోగాలు మోపింది. వారిలో కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ కూడా ఉన్నారు.  వీళ్లంతా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఆరేళ్లకు పైగా సాగిన విచారణ గత ఏప్రిల్‌ 26న ముగిసింది.

నవంబర్ ఏడున తుది తీర్పు ఇస్తామని కోర్టు ప్రకటించింది. సరిగ్గా తీర్పుకు రెండు రోజుల ముందు.. నవంబర్ 5న చెన్నై పర్యటనలో ప్రధాని మోడీ…కరుణానిధీతో సమావేశమయ్యారు.మోడీ, కరుణా భేటీపై అనేక అరోపణలు వచ్చాయి. కేసును మరింతగా స్టడీ చేయాల్సి ఉందని…తీర్పును వాయిదా వేసింది కోర్టు. తాజాగా ఈ కేసులో రాజా, కనిమొళిని నిర్దోషులుగా తేల్చింది.

ఓ వైపు ఆర్కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుండటం..మరోవైపు డీఎంకే నేతలకు క్లీన్ చీట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే కీలకనేతలు నిర్దోషులుగా బయటపడటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -