ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్లె ఓవర్ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న 18 మృతదేహాలను వెలికితీశారు. మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. శిథిలాల కింద 50 మందికి పైగా కార్మికులు చిక్కొకొని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
సాక్ష్యాత్తు దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమిది. అది కూడా.. నియోజకవర్గంలోని ఏదో మారు మూల ప్రాంతం కాదు. నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతంలోని జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోటు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కుప్పకూలిన వైనం షాకింగ్ గా మారింది. ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో 20 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు. శిధిలాల కింద ఒక మినీ బస్సు.. నాలుగుకార్లు.. 10 టూవీలర్లు ధ్వంసమయ్యాయి.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. భారీగా ఉన్న ఫైఓవర్ శిధిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఉదంతంలో మరణించిన కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ప్రాజెక్టు చీఫ్ మేనేజర్ తో పాటు మరో ముగ్గురు బాధ్యుల్ని గుర్తించి సస్పెండ్ చేశారు ముఖ్యమంత్రి యోగి.ఇదిలా ఉండగా.. నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని.. తరచూ బీజేపీ నేతలు వచ్చి సందర్శించినా.. కుప్పకూలటం అంటే.. నిర్మాణం ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ఈ ప్రమాదం మీద ప్రధాని మోడీ స్పందించారు. ఫైఓవర్ కూలిపోయిన ఘటన ఎంతో విచారకరమని.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలుపుతున్నామని.. అవసరమైన అన్ని సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా మోడీ వెల్లడించారు. రూ.129 కోట్ల వ్యయంతో 2261 మీటర్ల పొడవున ఫైఓవర్ ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని సమాజ్ వాదీ నేత.. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన సంచలనంగా మారింది. తాజా విషాదంతో తాను కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నట్లు మోడీ వెల్లడించారు.