తెలంగాణ రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయానికి నేడు చేరుకున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ నందకిషోర్ సింగ్ మరియు ఇతర సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులు ఘనస్వాగతం పలికారు.
15వ ఆర్థిక సంఘం చైర్మన్ 18 నుంచి మూడు రోజుల పాటు అనగా ఈ నెల 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే పలు సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన నేడు పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మొదటగా సమావేశం అవుతారు, అనంతరం ఆయన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం అవుతారు. సాయంత్రం పరిశ్రమల శాఖ అధికారులు,CII,TIF, FICCI,FTAPCCI ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 19న జూబ్లీహాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు, అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన పాల్గొంటారు.
15వ ఆర్థిక సంఘం సభ్యులు, డా. అనూప్ సింగ్, డాక్టర్.రమేష్ చంద్, జాయింట్ సెక్రటరీ ముక్ మిత్ సింగ్ భాటియా, మీడియా అడ్వైజర్ మౌసమీ చక్రవర్తి, డైరెక్టర్లు గోపాల్ ప్రసాద్, భరత్ భూషణ్ గార్గ్, జాయింట్ డైరెక్టర్ ఆనంద్ సింగ్ పర్మార్, డిప్యూటి డైరెక్టర్ నితీష్ షైనీ, అస్టిస్టెంట్ డైరెక్టర్ సందీప్ కుమార్, డి.డి.ఓ. డి.కె.శర్మ, పీఎస్ త్యాగరాజన్ లతో పాటు ఇతర అధికారులు చైర్మన్ వెంట ఉన్నారు.