గ్రేటర్‌ కోటా..ఛాన్స్ దక్కేదెవరికి..!

333
telangana cabinet
- Advertisement -

ఈ నెల 19న మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో కేబినెట్‌లో బెర్త్‌ దక్కించుకునేందుకు గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు. అయితే గ్రేటర్‌ పరిధిలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆశావాహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

గత కేబినెట్‌లో గ్రేటర్‌ నుండి ఐదుగురు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ సారి సామాజిక వర్గ సమీకరణలు,అన్ని జిల్లాల ప్రాతినిధ్యం దృష్ట్యా ఎంతమందికి చాన్స్‌ దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో ఈ దశలో తమ పేరు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు గ్రేటర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

పనితీరు ఆధారంగా తనకు అవకాశం వస్తుందని ఓ నేత భావిస్తుంటే తొలి నుండి పార్టీకి,కేసీఆర్‌కి విధేయుడిగా ఉన్న తనకే చోటు దక్కుతుందని మరో నేత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఎవరికి వారే తమ గాడ్‌ ఫాదర్‌ల ద్వారా పెద్దాయన చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.

మంత్రి పదవి ఆశీస్తున్న వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్,పద్మారావు గౌడ్‌ ప్రధానంగా ఉండగా వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ సైతం కేబినెట్‌ బెర్త్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

వీరికి సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి, కుత్బుల్లా పూర్ నియోజకవర్గాల నుంచి గెలిచినమాధవరం కృష్ణారావు, మాగంటి గోపినాథ్, ఆరికెపూడి గాంధీ, కేపీ వివేకానందలు మంత్రి పదవులపై గంపె డు ఆశలు పెట్టుకున్నారు. వీరికి తోడు మల్కాజ్ గిరి నుండి గెలిచిన మల్లారెడ్డి పేరు కూడా వినిపిస్తుండటంతో గ్రేటర్ పరిధిలో మంత్రివర్గంలో చోటు కోసం పదుల సంఖ్యలో ఉండగా ఫైనల్‌గా ఎవరికి బెర్త్‌ కన్ఫామ్‌ అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -