ఓ వైపు భారీ లక్ష్యం..తొలి మ్యాచ్‌లో ఓటమి..వెరసీ హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ గెలుస్తుందా లేదా అన్న సందేహం అందరిలో. కానీ ఎవరు ఊహించని విధంగా వార్నర్ మెరుపులు మెరిపించడంతో లక్ష్యం చిన్న బోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్‌ని ఊచకోత కోస్తూ దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ దాటించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్‌లో పరుగుల వరద పారించారు. డేవిడ్ వార్నర్ మెరుపులకు తోడు బెయిర్‌స్టో,విజయ్ శంకర్ల వీర విధ్వంసంతో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన సన్ రైజర్స్ ఐపీఎల్-12లో బోణీ కొట్టింది.
199 పరుగుల భారీ లక్ష్మంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు వార్నర్ (69; 37 బంతుల్లో 9×4, 2×6) అదరగొట్టాడు. వార్నర్ ఔటైన కొద్దిసేపటికే బెయిర్‌స్టో నిష్క్రమించినా ఆ ప్రభావం జట్టుపై పడలేదు. విజయ్ శంకర్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 3 సిక్సర్లు, ఒక బౌండరీతో క్రీజులో ఉన్నంతసేపు వినోదాన్ని పంచాడు. ఐతే 3 పరుగుల తేడాలో విలియమ్సన్ (14), విజయ్ శంకర్, మనీష్ పాండే (1) ఔటవడంతో సన్‌రైజర్స్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. యూసుఫ్ పఠాన్ (16 నాటౌట్; 12 బంతుల్లో 1×6), రషీద్ ఖాన్ (15 నాటౌట్; 8 బంతుల్లో 1×4, 1×6) రాణించడంతో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కొల్పోయి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజు శాంసన్ (102 నాటౌట్; 55 బంతుల్లో 10×4, 4×6) శతకంతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ ఆజింక్య రహానె (70; 49 బంతుల్లో 4×4, 3×6) బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో రాజస్థాన్ ..భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచగా చివరి 10 ఓవర్లలో రాజస్థాన్ 123 పరుగులు చేసింది.