అద్భుత పలితాలు సాధిస్తున్న సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు నడపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ, కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంకేమ వ్యవహారాలు చూస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి ఎకె ఖాన్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతి కుమారి, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీల మాదిరిగానే మైనారిటీ పిల్లలకు మంచి విద్య అందించాల్సిన బాధ్యత ఉందని, వారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 160 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కావాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే 71 మైనారిటీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినందున, మిగతా 89 గురుకుల పాఠశాలను వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. మొత్తం 160 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 55 వేల మందికి పైగా విద్యార్థులకు మంచి విద్య బోజనం, వసతి కల్పించాలని చెప్పారు. ఈ విద్యాలయాలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు. విద్యా సంస్థల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని, కావాల్సిన నిధులను బడ్జెట్లో పెడతామని సిఎం స్పష్టం చేశారు. ప్రతీ ఏడాది మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణకు సంబందించిన వ్యయాన్ని బడ్జెట్ లో తప్పక చేర్చాలని కూడా సిఎం ఆదేశించారు.
సాంమీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ తో పాటు పలు ఉన్నత విద్యా కోర్సులకు ఎంపికవుతున్నారన్నారు. ఆ పాఠశాలల నిర్వహణపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని, మైనారిటీ గురుకుల పాఠశాలలు కూడా అదే ప్రమాణాలతో నడవాలని సిఎం ఆకాంక్షించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 120 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించాలని, గతంలో నిర్ణయించామని, అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచే 71 మైనారిటీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అయితే ఈ విద్యా సంస్థల్లో చేరడానికి మైనారిటీలు ఎంతో ఆసక్తి చూపుతున్నందున వాటి సంఖ్యను పెంచాలని నిర్ణయించామన్నారు. మైనారిటీలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ద్వారా వారికి మంచి జీవితం అందించగలుగుతామనేది తన ఉద్దేశ్యమని సిఎం చెప్పారు. అందుకే రాష్ట్రంలో 160 మైనారిటీ విద్యా సంస్థలుండాలని నిర్ణయించామన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ పట్టణాల్లో ఆరు చొప్పున (మూడు బాలికలకు, మూడు బాలురకు) మైనారిటీ విద్యాసంస్థలుండాలన్నారు.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఖచ్చితంగా ఉండాలని, ముస్లింలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో రెండు, మూడు విద్యా సంస్థలు నెలకొల్పాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 8 విద్యాసంస్థలున్నాయని, మరో 12 విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబందించిన ప్రక్రియను వెంటనే ప్రారంబించాలని కూడా ఆదేశించారు. 5,6,7 తరగతుల్లో ప్రవేశం కల్పించి, ప్రతీ ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలని సూచించారు. ముస్లింల జనాభాను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగా అదనపు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముస్లిం పిల్లలు మంచి విద్యా వంతులు కావాలని, అందుకోసం ప్రభుత్వం అవసరమైన చేయూత అందివ్వాలని సిఎం నిర్ణయించారు.
మొదటి ఏడాది ప్రారంభించిన మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణ బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం నెలకొల్పిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. మైనారిటీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమాలకు సంబందించిన పోటోలు చూసి ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి అన్ని విద్యా సంస్థలకు సొంత భవనాలుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం గంగా జమునా తెహజీబ్ అనడానికి ఇటీవల జరిగిన వినాయక చవితి తాజా ఉదాహరణ అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మతాల పేరిట ఎన్నడూ విడిపోలేదని, అంతా కలిసే పండుగలు చేసుకుంటారని సిఎం వివరించారు. బతుకమ్మ, దసరా, పీరీల పండుగలను కలిపే చేసుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. జమ్మిచెట్టు దగ్గరికి, పాలపిట్టను చూడడానికి అందరూ కలిసే వెళతారన్నారు. దర్గాల దగ్గరికి కూడా పెద్ద ఎత్తున జనం మతాలకు అతీతంగా వెళతారని, ప్రార్థనా మందిరాలను ప్రజలు, భక్తుల మాదిరిగానే సందర్శిస్తారు తప్ప మత ప్రాతిపదికన కాదని వెల్లడించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా లౌకిక స్పూర్తి కనిపించిందన్నారు. చాలా చోట్ల గణేష్ మండపాల వద్ద ముస్లింలు పూజలు చేశారని, ఉత్సవాల్లో పాల్గొన్నారని, లడ్డూ వేలంలో పాల్గొని దక్కంచుకున్నారన్నారు. అలా కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజలంతా బాగుండాలని, అన్ని వర్గాల బావితరాలు బాగుండడం కోసం కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల మాదిరిగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.