మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులు భూకుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం ఫ్యామిలీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉజ్జయిని నగర పరిసరాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఓ జాతీయ దినపత్రిక వెల్లడించింది. డిసెంబర్ 13, 2023న మోహన్ యాదవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆయన కుటుంబం దాదాపు ₹45 కోట్ల విలువైన 137 ప్లాట్లను (సుమారు 168 ఎకరాలు) కొనుగోలు చేసింది.
ఈ భూ లావాదేవీల్లో అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే యాదవ్ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రహదారి ప్రాజెక్టులు, హైవే విస్తరణ పనులకు ఆనుకునే ఈ భూములు ఉన్నాయి. అలాగే ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035 ప్రకారం వ్యవసాయ భూముల నుండి నివాస, వాణిజ్య (కమర్షియల్) ప్రాంతాలుగా మార్పు చేసిన జోన్లలోనే ఈ కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా గంగేడి, ఉన్‌హేల్, జైవంత్‌పురా, పాండ్యాఖేడి వంటి ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి.
ఈ కొనుగోళ్లలో సీఎం భార్య, కుమారుడు, కోడలు, సోదరులతో పాటు ఆయన బాబాయి కుమారులు (కజిన్స్) గోవింద్ యాదవ్, నిలేష్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. వీరు కొన్ని భూములను ఇండోర్‌కు చెందిన బిల్డర్లకు అప్పగించి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సీఎంగా పదవి చేపట్టకముందే ఈ కుటుంబానికి 179 ఎకరాల భూమి ఉండగా పదవిలోకి వచ్చాక భూముల కొనుగోలు వేగం ఊహించని విధంగా పెరిగింది.
ఈ ఆరోపణలపై సీఎం కార్యాలయం స్పందించనప్పటికీ….సీఎం కజిన్ అనంత్ యాదవ్ మాట్లాడుతూ.. తమ కుటుంబం 2010 నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉందని…ఒక వ్యక్తి సీఎంగా ఉన్నంత మాత్రాన తాము వ్యాపారాలు మూసుకోవాలా అని ప్రశ్నించారు.
Also Read:#NBK112..గ్రాండ్ లాంచ్

