సీనియర్ బీజేపీ నేత జార్జ్ కురియన్ రాజ్యసభ సభ్యునిగా తన ఆరేళ్ల పదవీకాలం ముగియడం, పార్టీ ఆయనను ఎగువ సభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఈరోజు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) కింద కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కేరళలోని కొట్టాయంకు చెందిన 65 ఏళ్ల కురియన్… న్యాయవాది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా కేరళ పర్యటనలకు వచ్చినప్పుడు వారి ప్రసంగాలను మలయాళంలోకి అనువదిస్తూ తరచూ కనిపించేవారు. కేరళలో క్రైస్తవ సమాజానికి చేరువవడం ద్వారా పార్టీ ఉనికిని విస్తరించుకోవాలనే బీజేపీ వ్యూహంలో భాగంగా 2024లో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
కేరళలోని అత్యంత ప్రముఖ క్రైస్తవ చర్చిలలో ఒకటైన సిరో-మలబార్ కాథలిక్ చర్చికి కురియన్ చెందుతారు. 1980లో బీజేపీ ఆవిర్భవించినప్పటి నుండి ఆయన పార్టీలో ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, భారతీయ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా మరియు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.
2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పుతుపల్లి నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఊమెన్ చాండీపై కురియన్ పోటీ చేసి ఓడిపోయారు. 1999 నుండి 2004 వరకు వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత ఓ. రాజగోపాల్‌కు ఆయన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా కూడా పనిచేశారు.
Also Read;#NBK112..గ్రాండ్ లాంచ్
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది తనను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయడం లేదనే విషయాన్ని కురియన్‌కు ముందే సమాచారం ఇవ్వలేదు. అందుకే జూన్ 4న 11 మంది అభ్యర్థుల జాబితా విడుదలైనప్పుడు ఈ కేరళ నేత ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో మాజీ మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎదురైన పరిస్థితినే కురియన్ కూడా ఎదుర్కొన్నారు. నఖ్వీని కూడా పార్టీ తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడానికి ఒక రోజు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది.

