దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఢిల్లీ విమానాశ్రయ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో వసతులు లేమిపై తాజాగా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్టు చేశారు. “లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా ఎయిర్‌పోర్టులోకి వచ్చినప్పుడు ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్స్ కోసం ప్రయాణీకులకు పత్రాలను అందించారు. అయితే ఆ పత్రాలను నింపడానికి ప్రయాణీకులు కొందరు నేలపై కూర్చుని ఉంటే మరికొందరు గోడపై పత్రాలను ఉంచి నింపుతున్నారు. టేబుల్స్‌ను ఏర్పాటు చేయడం అనేది చాలా సాధారణ సర్వీస్ దాన్ని అందించాల్సింది. అలాగే వెలుపల ద్వారం వద్ద ఉండే హ్యాంగర్ దగ్గర వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు విదేశీయులకు మనదేశంపై కలిగే మొదటి అభిప్రాయం మరోలా ఉంటుంది. ఈ విషయంపై దృష్టి సారించండి..ధన్యవాదాలు” అని ట్వీట్ లో పేర్కొన్నారు రాజమౌళి.
ఇదిలా ఉంటే రాజమౌళి చేసిన ట్వీట్‌పై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ యాజమాన్యం స్పందించింది. రాజమౌళి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ పట్ల ధన్యవాదాలు తెలిపిన ఎయిర్ పోర్ట్ యాజమాన్యం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష సంబంధిత అంశాల కోసం నిర్దేశిత ప్రదేశాల్లో డెస్క్‌లు ఉన్నాయని, మరికొన్ని ప్రదేశాలలో డెస్క్‌లు పెంచుతామని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు అత్యవసరంగా ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ట్వీట్టర్ వేదికగా ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే.