రివ్యూ: జ్యో అచ్యుతానంద

286
jyo achutananda
jyo achutananda
- Advertisement -

తనలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో ‘వూహలు గుసగుసలాడే’తోనే నిరూపించారు శ్రీనివాస్‌ అవసరాల. తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కొద్దిరోజులుగా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. మరి ప్రేక్షకుల అవసరాలను అవసరాల తీర్చాడా..? రివ్యూలో చూద్దాం..

కథ :

అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) ఇద్దరు మంచి అన్నదమ్ములు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ చాలా స్నేహంగా ఉంటారు. ఒకరికోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్లు ఉంటారు. ఈ ఇద్దరూ, సరదాగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో వారింటికి జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. దీంతో ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోతారు. అచ్యుత, ఆనంద్.. ఇద్దరూ జ్యోత్స్నని ప్రేమిస్తూ ఉంటారు. కానీ జ్యో మాత్రం తాను వేరొక అబ్బాయిని ప్రేమించానని చెప్పి అమెరికా వెళ్లిపోతుంది. అచ్యుత్‌.. ఆనంద్‌లు పెళ్లి చేసుకొన్నాక మళ్లీ జ్యో అమెరికా నుంచి వస్తుంది. వచ్చాక అన్నదమ్ములిద్దరికీ ఐ లవ్‌ యూ.. అని చెబుతుంది. దాంతో వీరిద్దరి కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నది కథ.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే స్క్రిప్ట్ అనే చెప్పాలి. సినిమా మొత్తాన్ని చూసినప్పుడు ఇందులో ఉన్నది చిన్న కథే అనిపిస్తుంది. కానీ అవసరాల స్క్రీన్‌ప్లే మాయాజాలంతో తెరపై అదనంగా రెండు కథలు పుట్టుకొచ్చినట్టు అనిపిస్తాయి. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ఈ ముగ్గురి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సెకండాఫ్‌లో నారా రోహిత్, నాగ శౌర్యల మధ్యన వచ్చే సన్నివేశాలు కథకు మంచి అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సినిమా ఆద్యాంతం డైలాగులతో, సన్నివేశాల్లో వచ్చే కన్ఫ్యూజన్‌తో పుట్టించిన కామెడీ కట్టిపడేసేలా ఉంది.

జ్యో కథని అన్నదమ్ములిద్దరూ వాళ్ల భార్యల ముందు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు అదే కథ మరో కోణంలో తెరపై కనిపిస్తుంది. ఆ లెక్కన ఒకే సన్నివేశాన్ని తెరపై మూడుసార్లు చూడాల్సొస్తుంది. అయినా సరే, మాటల్లోని మెరుపులతో ఎక్కడా బోర్‌ కొట్టించకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు అవసరాల. కామెడీ కోసమనో.. భావోద్వేగాల కోసమనో.. లేదంటే ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయాలనో.. దర్శకుడు ఎక్కడా కథని విడిచి సాము చేయలేదు. కథ నుంచే వాటిని పుట్టించారు.ఇందులో ఇంటర్వెల్ బ్లాక్, మొదటి ముఫ్పై నిమిషాల పాటు సాగే సరికొత్త నెరేషన్, క్లైమాక్స్ లాంటివి హైలైట్స్‌గా చెప్పొచ్చు.

jo achyutananda
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు పెద్దగా మైనస్ పాయింట్లు లేవనే చెప్పాలి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామా ఎక్కువై, కొన్నిచోట్ల సినిమా నెమ్మదించింది. ఇక సెకండాఫ్‌లో రివెంజ్ తీర్చుకోవడం అంటూ రెజీనా పాత్ర చేసే డ్రామా బాగోలేదు. తెలిసీ ఒక ఎంగేజ్‍మెంట్ ఒప్పుకొని, మళ్ళీ చెడగొడ్డడం లాంటివి కథ పరంగా కూడా అనవసరమైనవనే అనిపించింది.

సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విషయానికి వస్తే, తన మొదటి సినిమాతో కేవలం రైటింగ్ పరంగానే ఎక్కువ మార్కులు వేయించుకున్న అవసరాల శ్రీనివాస్, ఈ సినిమాతో రైటింగ్, మేకింగ్ రెండింట్లోనూ ఒక స్థాయి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చూడ్డానికి సింపుల్‌గా కనిపించే కథను కూడా ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో, కామెడీ టైమింగ్ ఉన్న డైలాగులతో, ఎమోషన్ దెబ్బతినకుండానే కథ నుంచే పుట్టే సందర్భానుసారమైన కామెడీతో ఆద్యంతం కట్టిపడేశాడు. మొదటి ఇరవై నిమిషాల్లో, క్లైమాక్స్ సన్నివేశాల్లో మేకింగ్ పరంగా శ్రీనివాస్ చేసిన ప్రయోగాలు చాలా బాగున్నాయి. కల్యాణ్‌ రమణ బాణీలు.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొంటాయి. దిలీప్‌ కెమెరా పనితనం బాగుంది. నిర్మాతల అభిరుచిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. తెరపైన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు శ్రీనివాస్‌ అవసరాలలో రాటుదేలిన రచయిత.. దర్శకుడు గుర్తుకొస్తూనే ఉంటాడు.
తీర్పు :
వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవితంలో జరిగే కథలే సినిమాలైతే అలాంటి సినిమాలు చూడడానికి ఎప్పుడూ బాగుంటాయి. అవసరాల శ్రీనివాస్ తన రచనతో చేసిన అలాంటి మ్యాజిక్కే ‘జ్యో అచ్యుతానంద’. కథగా చూస్తే చాలా సింపుల్‌గా కనిపించే దాన్నే చివరివరకూ ఆసక్తికరంగా, ఓ బలమైన సినిమాగా మలచడంలో సఫలమవ్వడం, తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటులు, సరదాగా సాగుతూనే ఎక్కడో ఓచోట ఆలోచింపజేసేలా సాగే సన్నివేశాలు.. ఇలా చాలా ప్లస్‌లతో వచ్చిన ఓ అందమైన కథే ‘జ్యో అచ్యుతానంద’. ప్రేక్షకుల అవసరాలను తెలుసుకున్న అవసరాల శ్రీనివాస్‌.. చాలా అవసరమైన సినిమా తీశాడని చెప్పచ్చు.

విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2016
రేటింగ్ : 3.25/5
నటీనటులు : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా
నిర్మాత : సాయి కొర్రపాటి
సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ
దర్శకత్వం :అవసరాల శ్రీనివాస్

- Advertisement -