దేశీయ టెలికంలోకి జియో ఎంట్రీ తరువాత మొబైల్ టారిఫ్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన టెల్కోలన్నీ దిగివచ్చి చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటించగా తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ బొనాంజా ప్రకటించింది. జియోకు ఏమాత్రం తగ్గకుండా తాను కూడా ఉచిత వాయిస్ కాల్స్ ఇస్తానని తాజాగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
తాజాగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్ టెలికాం వర్గాల్లో సంచలనం రేపుతోంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తోంది బిఎస్ఎన్ఎల్. దీంతో జియోకు పోటీగా దూసుకొస్తున్న మరో టెలికం సంస్థగా బీఎస్ఎన్ఎల్ మారనుంది. అంతేకాదు జియో కేవలం 4జీ ఫోన్లకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 2జీ, 3 జీ ఫోన్లకు ఈ సౌకర్యం అందించనుందట.
బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ప్రస్తుతం జియో పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుండి జియో కంటే అతి తక్కువ టారీఫ్‌లతో కొత్త ఆఫర్లను కూడా ప్రవేశపెడ్తమన్నారు. అదేవిధంగా కొత్త ఆఫర్లతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తమన్నారు. ఈ ప్లాన్ కేవలం రూ.2 నుంచి రూ.4 ఉండొచ్చని శ్రీవాత్సవ వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదార్లతోపాటు ఇంటి వద్ద బ్రాడ్ బ్యాండ్ సేవలు ఉపయోగించుకుంటున్న వారికి కూడా ఈ ప్లాన్ అందిస్తామని శ్రీవాత్సవ చెప్పారు. ప్రస్తుతం జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149 చెల్లించాలి.
బిఎస్ఎన్ఎల్కు అతిపెద్ద మార్కెట్ కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. ఈ ప్రాంతాల్లో జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అందించనున్నట్లు ఈ ప్లాన్ లోకి ప్రవేశించేందుకు కూడా అతితక్కువ మొత్తంలోనే రుసుము వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.