సోలో బతుకే సో బెటరూ….

310
Women Rejects For Marriage After Divorce
Women Rejects For Marriage After Divorce
- Advertisement -

పెద్దల సమక్షంలో పెళ్లి… కష్ట సుఖాల్లో కలిసి ఉంటానని వేద మంత్రాల సాక్షిగా  ప్రమాణం అయినా… అవగాహన లోపంతో దంపతుల మధ్య మనస్పర్ధలు.. ఇగోతో ఒకరు.. ఓపిక లేక మరొకరు.. ఇద్దరి మధ్య ఎప్పూడు గొడవలే.. జాబ్‌ చేస్తున్న దంపతుల మధ్య ఆదిపత్య పోరు.. ఇలా చిన్న చిన్న మనస్పర్ధలతో విడాకుల బాటలో ప్రయాణించి ఒంటరవుతున్నారు లేడీస్‌.. తాళికట్టిన భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి కి నిరాకరిస్తున్నారు మహిళలు..

భవిష్యత్‌ పై ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలతో ఒక్కటవుతున్న జంటలు చిన్న సమస్యలతోనే బ్రేకప్‌ అవుతున్నారు. జంటలు విడిపోయినా ఒంటరి బతుకే బావుందంటున్నారు మహిళలు.. పెళ్లైన కొత్తలో పెళ్లికి టాటా చెప్పేది కొందరైతే.. పెళ్లై పిల్లలున్నా బంధానికి బైబై చెప్పేది మరి కొందరు. అభిప్రాయాలు కుదరక, భర్తల మనస్తత్వాలు నచ్చక, మొగుడి టార్చర్‌ భరించలేక, అత్తింటి వారి వేధింపులు భరించలేక, డ్రగ్స్, మత్తు మందులకు భర్త బానిసయ్యాడని వదిలేసే ఇంకొందరు.. రకరకాల కారణాలతో సంఘర్షణకు లోనైన ఆడవాళ్లు విడాకులు తీసుకున్నాక మరో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు..

గడిచిన శతాబ్దం వరకు స్త్రీలు విడాకులు తీసుకోవడం అంటే ఎరుగరు. అదేదో మహాపాపంగా భావించేవారు. భర్తలు తన్నినా, గెంటినా, తగలేసినా ఎదురుతిరగడమే తెలియదు. పూర్వజన్మలో చేసిన పాపంవల్లనే ఇలాంటి భర్త దొరికాడని ఆ బాధలు పడితే వచ్చే జన్మలో మంచి భర్త లభిస్తాడనే నమ్మకంతో ఎన్ని కష్టాలనయినా అనుభవించేవారు. ఆనాటి సమాజంలో పురుషుడు స్త్రీని కట్టుబానిసగా చేశాడు. పురుషాహంకారంతో అణగత్రొక్కాడు. ప్రపంచ మహిళా సంవత్సరం, దశాబ్దానంతరం మహిళల్లో కొంతలో కొంత చైతన్యం, జాగృతి కలిగాయి. తమ స్వేచ్ఛా హక్కుల గురించి తాము ఆలోచించుకోగల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. తాము ఆడవాళ్ళమయినంత మాత్రాన ఎందుకు లొంగిపోవాలి అనే ఆలోచనలు పెల్లుబికిపోయాయి. ఆ పరిణామంలోని ఆలోచనే ఎందుకు విడాకులు పొందరాదు? అనేది. క్రమేపి భరించలేని భర్తలకు విడాకులు యిద్దామనే ప్రేరణ కలిగింది. దానికి మూలం మావంటివారి ఆధునిక భావాలే. చావటానికి సిద్ధమైనవారిని చావవద్దు విడిపోండి అనే సలహా యిచ్చే కేంద్రాలు ఈనాడు ఎన్నో వెల్లివిరిశాయి.

స్త్రీలు విడాకులను ఎందుకు కోరుకుంటున్నారు? వారికి వైవాహిక జీవితం దుర్భరమయినందున తప్పనిసరిగా విడాకులు కోరుకుంటున్నారు. విడాకులు వచ్చిన తరువాత ఎక్కువగా ఒంటరి జీవితం ఎదురవుతుందని తెలిసి దీనికి పూనుకుంటున్నారు. ఆ భర్తతో కలిసి కాపురం చేసేదానికన్నా విడాకులు పొందిన స్త్రీగా మనగలగడం తేలికని, మంచిదని భావించడంవల్లనే అందుకు ఉద్యుక్తులవుతున్నారు.
పూర్వంలోకంలో భర్తలు భార్యలను చూచే పద్ధతి మారిందా? లేక భార్యల దృక్పథం మారిందా అనేది మీమాంస. భార్యలను పరిగణించే విధానం పూర్వం రెండు లక్షణాలు కలిగి వుండేది. అవి 1. పురుషాధిక్యత 2. పురుష పెత్తనం. స్త్రీకన్నా పురుషుడు మిన్న అనే భావం ఆనాడూ ఈనాడూ వుంది. ఆనాడు ఆ భావాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు. ఈనాడు నాజూకుగా, నగిషీగా, మెత్తగా, పైకి అందంగా బహిర్గతం చేస్తున్నారు. రెండవది భర్త పెత్తనం. పూర్వం పెత్తనం స్పష్టంగా, అందరికీ తెలిసేలా సాగించేవారు. ఇపుడు స్త్రీ పురుష సమానత్వాన్ని ఆశించే వ్యక్తిగా, అంగీకరించిన మనిషిగా సంచరిస్తూ ఆచరణలో దానికి విరుద్దమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు భర్తలు. అంటే భావాలు అవే. కాకపోతే వాటి రూపాలు మారాయి. మాటలు మారాయి. మాటలకు, చేతలకు మధ్య అగాధం గోచరిస్తున్నది.

ఓపిక నశించి విడాకులు తీసుకున్న మహిళలు రెండో పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

- Advertisement -