100 డేస్ ఆఫ్ ల‌వ్‌ మూవీ రివ్యూ

514
100 Days of Love – Slow Romance
100 Days of Love – Slow Romance

మణిరత్నం రూపొందించిన ‘ఓకే బంగారం’తో తెలుగులోకి ప్రవేశించిన నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌. నిత్యా మీనన్‌ జోడీతో బాగా పాపులర్‌ అయింది. మలయాళంలో ‘ఉస్తాద్‌ హోటల్‌’తోనే మంచి పెయిర్‌గా మారిన ఈ జంట మరో ప్రయత్నం ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’. మళయాలంలో గతేడాది విడుదలైన ఈ సినిమా ఇప్పటికి తెలుగులో వచ్చింది. నిత్య మేనేజర్‌ వెంకట్‌ దీన్ని తెలుగులో అనువదించారు. మరి దుల్కర్-నిత్యామీనన్ జోడీ మళ్ళీ ఆకట్టుకుందా? చూద్దాం..

కథ :

రావు గోపాల‌రావు (దుల్క‌ర్‌) ఓ ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తుంటాడు. ఎడిట‌ర్‌తో విబేధాల కార‌ణంగా అత‌నికి ఉద్యోగం పోతుంది. వ‌ర్షంలో త‌డుస్తూ ట్యాక్సీ కోసం వెతుకుతున్న అత‌నికి ఓ అమ్మాయి(నిత్య‌మీన‌న్‌) క‌నిపిస్తుంది. ట్యాక్సీలో ఎక్కే కంగారులో ఆమె కెమెరాను అక్క‌డ జార‌విడుచుకుంటుంది. దాన్ని తీసుకున్న రావుగోపాల‌రావు అలియాస్ ఆర్.జి.ఆర్ అందులోని ఫోటోల‌ను డెవ‌ల‌ప్ చేస్తాడు. త‌న‌తో పాటు ఉండే గుమ్మ‌డి అనే స్నేహితుడి స‌హాయంతో ఆమె కోసం బెంగుళూరులో గాలింపులు మొద‌లుపెడ‌తాడు. గుమ్మ‌డికి వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. అదే మెంటాలిటీతో లెవ‌ల్ 1, 2 అంటూ వీడియో గేమ్‌లోని లెవ‌ల్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెను వెదికే ప్ర‌య‌త్నం చేస్తాడు. చివ‌రికి ఆమె సావిత్రి అని తేలుతుంది.  మొత్తానికి ఆమెను శోధించి కనిపెట్టినప్పుడు తనెవరో చెబుతుంది. పైగా అప్పటికే రాహుల్‌ అనే వ్యక్తిని పెళ్ళాడేందుకు సిద్ధపడుతుంది. తాను పెళ్ళిచేసుకునే వాడిలో స్థిరత్వం ఉండాలనుకునే సావిత్రి, నచ్చిన పని చేస్తూ తనలా తానుండాలనుకునే గోపాల్‌.. వీరిద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే సెకండాఫ్‍‌లో దుల్కర్ – నిత్యా మీనన్‌ల జర్నీ అనే చెప్పుకోవాలి. అప్పటివరకూ సాదాసీదాగా నడిచే కథను వీరిద్దరి ప్రయాణం మంచి మలుపులు తిప్పుతుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా దుల్కర్ నిత్యా మీనన్‌కి ప్రపోజ్ చేసే సీన్, నీ ఒరిజినల్ మనిషిని బయటకు తీయ్ అని చెప్పే సీన్ లాంటివి చాలా బాగున్నాయి. అదేవిధంగా మొదట్నుంచీ చివరివరకూ దుల్కర్, శేఖర్ మీనన్‌ల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి.

నిత్యా మీనన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేంది. నిత్యా మీనన్‌ను క్లాసీ యాక్టర్ అని ఎందుకంటారన్నది ఈ సినిమాతో ఆమె మరోసారి ఋజువుచేసింది. దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌కు ఎక్కడా వంక పెట్టలేం. ఈ ఇద్దరూ చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా అద్భుతంగా పండించడంతో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ బలమైన ముద్రను సంపాదించుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాల్సి రావడమే ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్. హీరోయిన్‌ను వెతకడంలోనే ఒక భాగం మొత్తం పూర్తవ్వడంతో, ప్రేమకథను సెకండాఫ్‌లో కానీ మొదలుపెట్టలేదు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలు కూడా కొన్ని మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు, కొంత బోర్ కొట్టించినట్లు అనిపించాయి. ముఖ్యంగా నిత్యా మీనన్ కూడా ఇంటర్వెల్ వరకూ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వకపోవడం మైనస్సే. సెకండాఫ్‌లో నిత్యా మీనన్ – దుల్కర్‌ల రొమాన్స్‌తో సినిమా మళ్ళీ అసలు కథలోకి వచ్చినా అప్పటికే చాలా సమయం కాలయాపన చేశారనిపించింది. 155 నిమిషాల మేర నిడివి ఉన్న ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అనవసరమైనవిగానే కనిపించాయి.

సాంకేతిక విభాగం :

ప్రేమకథలే.. కొత్తగా ఏమీలేకపోయినా. చెప్పేవిధానంలో కాస్త స్లో అయినా దర్శకుడు జీనస్‌ మహమ్మద్‌ చూపిన ఆలోచన బాగుంది. పాత్రల ఆలోచనలు, పరిస్థితులను మార్చి ఈ రొమాంటిక్‌ కామెడీని సిద్ధం చేశారు. హృదయం కన్నులతో పాట దగ్గర్నుంచి చాలాచోట్ల మేకింగ్‌ పరంగా చాలా ప్రయోగాలనే చేశాడు. అయితే ఆ మేకింగ్‌ని అందుకునే స్థాయిలో కథనం లేకపోవడమే నిరుత్సాహపరచే అంశం. ఇక ప్రతీశ్‌ వర్మ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. లైటింగ్‌, షాట్‌ మేకింగ్‌.. కనులవిందుగా కనిపించడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్‌లో కొన్ని అనవసర సీన్లు తీసేస్తే బాగుండుననిపించింది. గోవింద్‌ మీనన్‌ సంగీతం బాగుంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.

తీర్పు :

మ‌ల‌యాళ సినిమాల‌కు, తెలుగు సినిమాల‌కు మ‌ధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది. తెలుగు సినిమాలు ఉన్నంత క‌మ‌ర్షియ‌ల్‌గా మ‌ల‌యాళ చిత్రాలు అనిపించ‌వు. తెలుగు చిత్రాలు ఉన్నంత స్పీడ్‌గా మ‌ల‌యాళ చిత్రాలు ఉండ‌వు. ఈ సినిమా విష‌యంలోనూ జ‌రిగింది అంతే. ప్ర‌తి స‌న్నివేశ‌మూ బాగానే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. కానీ స‌న్నివేశాల‌ను సినిమాగా చూడాలంటే మాత్రం విసుగ్గా క‌లుగుతుంది. ఎడిటింగ్ పేల‌వంగా సాగింది. దానికి తోడు రీరికార్డింగ్ కూడా ఎక్క‌డా పెద్ద‌గా మెప్పించ‌దు. కొత్తగా చెప్పాలనుకున్న అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నా, అవన్నీ చాలా నెమ్మదిగా నడిచే కథనంలో, ఇంటర్వెల్ వరకూ మొదలుకాని అసలు కథలో పూర్తి స్థాయిలో కనిపించకుండా పోయాయి. ఫ‌స్టాఫ్ మొత్తం బోరుగా సాగే ఈ సినిమా సెకండాఫ్‌లోనూ, అదీ ఆఖ‌రి పావు గంట మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తుంది.

ఓవరాల్‌ గా ఈ సినిమా  100 రోజులు సా…గిన ప్రేమ‌క‌థ‌

 

విడుదల తేదీ: ఆగష్టు 26, 2016

రేటింగ్:2.5/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్..

సంగీతం: గోవింద్ మీనన్

నిర్మాత: ఎస్. వెంకట రత్నం

దర్శకత్వం: జీనస్ మహమ్మద్