మన సుమ ఎంత మంచి యాంకరో మరోసారి రుజువైంది. తెలుగులో కార్యక్రమాలు నిర్వహించడంలోనే సుమ దిట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ. ఐతే ఆమె ఇంగ్లిష్ లోనూ అదరగొట్టగలదని.. ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ ను ముందు పెట్టుకుని ఏ తడబాటు లేకుండా చక్కగా యాంకరింగ్ చేయగలదని.. చక్కటి ప్రశ్నలు సంధించగలదని.. నిన్న ‘ఎం.ఎస్.ధోని’ ఆడియో వేడుకలో రుజువైంది.
టీమిండియా క్రికెటర్ మహేంధ్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎస్. ధోనీ’. ఈచిత్రాన్ని హిందీ పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జే.ఆర్.సి కన్వెషన్ సెంటర్లో జరిగింది.
ఈ ఆడియో వేడుకకు చిత్ర బృందంతో పాటు ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దర్శకు ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ధోనీతో కలిసి ఆడియో రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యహరించారు.
ధోనిని ముందు పెట్టుకుని ఆమె చాలా ప్రశాంతంగా.. మెచ్యూరిటీతో యాంకరింగ్ చేసింది. ధోనికి మైకు అందిస్తూ.. అతడితో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం పెట్టింది. తెలుగు సినిమాలు చూస్తారా అని.. హైదరాబాద్ గురించి చెప్పమని.. అభిమానులకు ఏదైనా సందేశం ఇవ్వమని అడగడంతో పాటు 2007 ప్రపంచకప్ ప్రస్తావన తీసుకొచ్చి దాని మీద కూడా ప్రశ్నలు వేసింది. ధోని అన్నింటికీ ఓపిగ్గా.. ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.
ఇక తాను బాహుబలి చూశానని చాలా బాగా నచ్చిందని మహేంద్రసింగ్ ధోని అన్నారు. సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నానన్నారు. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమన్నారు. “2000 సంవత్సరంలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడేందుకు తొలిసారి హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలోనే హైదరాబాద్ బిర్యానీ రుచి చూశాను. ఆ తర్వాత ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా బిర్యానీ తినకుండా వెళ్లలేదు. అలాగే ఇక్కడి గాజులు బాగుంటాయి. నా భార్య కోసం బహుమతిగా తీసుకెళ్లాను.” అని ధోని అన్నారు.
యూత్ కు మీరిచ్చే సందేశం ఏమిటని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ధోని ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ” జీవితంలో నిజాయితీగా ఉండాలి. గమ్యాన్ని చేరుకునే క్రమంలో రిస్క్ లు తప్పవు. హార్డ్ వర్క్ చేయాలి. పెద్దలపై గౌరవం ఉంటే అది ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది. ” అని ధోని అన్నారు. ఈ నెల 30న ఈ మూవీ రిలీజ్ కానుంది.