గత 35 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతోపాటు డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవం నిర్వహిస్తూ రసమయి సంస్థ ఇప్పటివరకు 50 మందికి పైగా నిష్ణాతులను “రసమయి-డా. అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు”తో సత్కరిస్తూ వస్తోందిది. ఇదే ఆనవాయితిగా ఈ సంవత్సరం డా. అక్కినేని నాగేశ్వరరావుగారి 93వ జయంతి సందర్భంగా ‘రసమయి-డా.అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును”ను కళాబంధు డా. టి.సుబ్బరామిరెడ్డి బహుకరించనున్నట్లు రసమయి అధినేత డా. ఎం.కె.రాము తెలిపారు.
డా. టి.సుబ్బరామిరెడ్డిగారు అక్కినేని నాగేశ్వరరావు గారితో 40 సంవత్సరాల అనుబంధం కలిగి, సినీ కళాకారులను తగురీతిన సత్కరిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ “కళాబంధుగా పేరు గాంచారు. 21 సెప్టెంబర్ 2016న సా 6:00 గంటలకు, రవీంద్రభారతి ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ రోశయ్య, సభాప్రారంభకులుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డా. సి.నారాయణరెడ్డి, జ్యోతిప్రకాశనం చేయుటకు ప్రముఖ సినీ నటి డా. జయప్రద, సభాధ్యక్షులుగా ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గౌరవ అతిథులుగా ప్రజానటి జమున, హాస్య నటులు డా. బ్రహ్మానందం, సినీ రచయిత డా.పరుచూరి గోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ , ఎమ్మెల్సీ పి.సుధాకర్ రెడ్డి,, విద్యావేత్త పొటూరి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొంటున్నారు.
కార్యక్రమానికి ముందు ఎం.కె. రాము రచించిన “మహానటుడు అక్కినేని-సంగీత నృత్యరూపకంతోపాటు పండిట్ అంజిబాబు, శ్రీధర్, ఆళ్ల శ్రీనివాస్‌ల నృత్య ప్రదర్శన, ఎస్.వి.ఆర్. చిన్ని అక్కినేని బాల్ పెన్ రేఖాచిత్రాల ప్రదర్శన ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.