లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరౌతున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలు ఆదివారం ధూంధాంగా జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ ఇందులో పాల్గొని పార్టీ శ్రేణులను, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రచార సభల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
నాగర్ కర్నూల్ లోక్ సభ సెగ్మెంట్ సమావేశం వనపర్తి రూరల్ మండలం నాగవరంలో జరుగనుంది. సభ కోసం పెద్దెత్తున ఏర్పాట్లు చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి రాములు పర్యవేక్షించారు. నాగర్ కర్నూల్ లో గులాబీ జెండా కచ్చితంగా ఎగురుతుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార సభ కోసం భూత్పూర్ సమీపంలో పెద్దెత్తున ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని.. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు 2 లక్షల మంది ప్రజలు తరలిరానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరగనున్న సీఎం కేసీఆర్ సభలకు లక్షలాదిగా జనం తరలిరానున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవనున్నారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజల కోసం టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. రాబోయే ఎన్నికల్లో 16 మంది టీఆర్ఎస్ ఎంపీల గెలుపే ధ్యేయంగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకెత్తున్నాయి.