బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన ‘అల్లుడు శీను’ సినిమాపై పెట్టిన పెట్టుబడి.. రాబడి చూసుకుంటే అది పెద్ద ఫ్లాప్ కిందే లెక్క. కానీ అతడి స్థాయికి తొలి సినిమాతో రూ.20 కోట్ల దారా రాబట్టడం అంటే గొప్ప విషయమే. ఐతే శ్రీనివాస్ రెండో సినిమా ‘స్పీడున్నోడు’ మాత్రం అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా వచ్చింది తెలియదు.. వెళ్లింది తెలియదు.
తాను మామూలుగా చాలా ధైర్యంగా వుంటానని, కానీ ఆ ఫెయిల్యూర్ని డైజెస్ట్ చేసుకోలేకపోయానని, స్పీడున్నోడు ఫ్లాప్ అయ్యాక బాగా ఏడ్చానని, చాలా రోజులు బయటకి రాలేదని చెప్పాడు. బహుశా కొడుకు అంతగా అల్లాడిపోవడం చూడలేకే తదుపరి చిత్రాన్ని మళ్లీ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సెట్ చేసినట్టున్నారు. బోయపాటి తీసిన ‘జయ జానకి నాయక’ చిత్రానికి ఇపుడు ట్రేడ్‌లో చాలా క్రేజ్ వుంది. కేవలం బోయపాటి బ్రాండ్‌తో ఈ చిత్రంపై భారీ బెట్టింగ్ జరుగుతోంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే తదుపరి చిత్రాన్ని శ్రీవాస్ డైరెక్షన్లో చేస్తున్నాడు శ్రీనివాస్. వినాయక్, బోయపాటి లీగ్‌లోని వాడు కాకపోయినా కానీ శ్రీవాస్‌కి కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు బాగానే వుంది.
‘స్పీడున్నోడు’ సరిగా ఆడకపోయినప్పటికీ బోయపాటి శ్రీనివాస్ దాని గురించి పట్టించుకోకుండా తనతో సినిమా చేయడం గొప్ప విషయమని అన్నాడు శ్రీనివాస్. బోయపాటి తనను సొంత అన్న లాగా చూసుకున్నాడని.. నీ వెనుక నేనున్నా అంటూ సపోర్ట్ చేశాడని.. తనతో ఇంకో సినిమా కూడా చేస్తానని మాటిచ్చాడని శ్రీనివాస్ తెలిపాడు. తనలో బోయపాటికి అంతలా ఏం నచ్చిందో అర్థం కాలేదని శ్రీనివాస్ వ్యాఖ్యానించడం విశేషం.