పొట్టి క్రికెట్‌లో అసలైన మజాను మరోసారి అభిమానులకు రుచిచూపించింది ఆసీస్. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పేలవమైన ఫామ్‌తో వన్డేల్లో స్థానం కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన విలువేమిటో టి20ల్లో చూపించాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.నిర్దాక్షిణ్యంగా లంక బౌలర్లపై విరుచుకుపడ్డ మ్యాక్స్ ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో పరుగుల వరద పారించిన వేళ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు బద్దలైంది.
మాక్స్‌వెల్ (145 నాటౌట్; 65 బంతుల్లో 14×4, 9×6) శతక్కొట్టడంతో మంగళవారం శ్రీలంకతో తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక పేరిటే ఉన్న రికార్డు (260/6, కెన్యాపై)ను తుడిచిపెట్టింది. హెడ్ (45; 18 బంతుల్లో 4×4, 3×6), ఖవాజా (36; 22 బంతుల్లో 2×4, 2×6) మెరిశారు. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లకు 178 పరుగులే చేయడంతో ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక అందుకు కచ్చితంగా చింతించి ఉంటుంది.
27 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన మ్యాక్స్.. మరో 22 బంతుల్లో శతకం పూర్తి చేయడం విశేషం. మాక్స్‌వెల్ తన చివరి 16 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సిక్స్‌లు, ఫోర్ల రూపంలోనే అతడు 110 పరుగుల చేశాడంటేనే ఎంతలా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు బద్దలైన వారం రోజులకే అంతర్జాతీయ టి20ల్లోనూ కొత్త రికార్డు నమోదు కాగా, రెండు సార్లూ శ్రీలంక పేరిట ఉన్న రికార్డు బద్దలు కావడం విశేషం.
టీ 20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్ (156) తర్వాత మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో నిలిచాడు.2013 ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 263 పరుగులు చేసింది.