క్యాన్సర్ వైద్యంలో నూతన అధ్యాయం

2
- Advertisement -

క్యాన్సర్ వైద్యంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మార్చబడిన ఇమ్యూన్ సెల్స్ (రోగనిరోధక కణాలను) ఉపయోగించి తీవ్రమైన క్యాన్సర్లపై పోరాడేలా రూపొందించిన ZI-MA4-1 అనే ప్రయోగాత్మక చికిత్సను వైద్యులు ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక రోగికి అందించారు. ప్రస్తుతం తొలి దశ (Phase 1) క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఈ చికిత్స, నయం కావడానికి కష్టంగా ఉండే పలు రకాల క్యాన్సర్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ చికిత్సను పొందిన తొలి వ్యక్తి ట్రేసీ టామ్లిన్సన్ (58). ఆమె 2020 నుండి తీవ్రమైన అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పలు సర్జరీలు, కీమోథెరపీలు చేసినప్పటికీ వ్యాధి తగ్గకపోవడంతో యుకేలోని మాంచెస్టర్‌లోని ‘ది క్రిస్టీ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్’లో జరుగుతున్న ఈ ప్రయోగాత్మక వైద్యంలో పాల్గొనడానికి ఆమె అర్హత సాధించారు.

ఇది ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో, విస్తృతంగా లభించే అధునాతన క్యాన్సర్ ఇమ్యునోథెరపీకి ఇది కీలక అడుగుగా మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. సాంప్రదాయ కీమోథెరపీ శరీరం అంతటా వేగంగా పెరిగే కణాలపై దాడి చేస్తుంది. ఇది ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, ఆరోగ్యకరమైన కణాలను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి దుష్ప్రభావాలు వస్తాయి.

అయితే ఈ కొత్త చికిత్సా విధానం భిన్నమైనది. ఇది నేరుగా క్యాన్సర్‌పై దాడి చేయకుండా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థనే క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా సన్నద్ధం చేస్తుంది. శాస్త్రవేత్తలు సహజంగా ఉండే ‘నాచురల్ కిల్లర్’ (NK) కణాలను తీసుకుని, వాటికి ‘MAGE-A4’ అనే ప్రోటీన్‌ను గుర్తించే ప్రత్యేక రిసెప్టర్లను జత చేశారు.

MAGE-A4 అనేది ప్రధానంగా క్యాన్సర్ కణాలపై ఉండే ఒక ప్రోటీన్. రక్తనాళాల ద్వారా ఈ మార్పులు చేసిన కణాలను శరీరంలోకి పంపినప్పుడు, అవి MAGE-A4 ఉన్న క్యాన్సర్ కణాలను మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించవు. ZI-MA4-1 చికిత్సను “ఆఫ్-ది-షెల్ఫ్” (Off-the-shelf – ముందే సిద్ధంగా ఉంచుకోగలిగే) థెరపీగా పిలవడం వల్ల ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర కణ చికిత్సల కోసం రోగి శరీరం నుండి రోగనిరోధక కణాలను సేకరించి, వాటిని ల్యాబ్‌లలో మార్పులు చేసి, కొన్ని వారాల తర్వాత మళ్లీ రోగికి ఎక్కిస్తారు. ఇది చాలా సమయంతో మరియు అధిక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఈ విధానంలో ఆరోగ్యవంతమైన దాతల నుండి కణాలను సేకరించి ముందే జన్యు మార్పిడి చేసి నిల్వ ఉంచుతారు. అంటే రోగికి అవసరమైన వెంటనే ఈ మందును అందించవచ్చు.

Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు

దీనివల్ల కలిగే ప్రయోజనాలు:

చికిత్స కోసం వేచి ఉండే సమయం తగ్గుతుంది.

ఆసుపత్రుల్లో సులభంగా అందుబాటులోకి వస్తుంది.

తయారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

ఎక్కువ మంది రోగులకు అధునాతన చికిత్స అందుబాటులోకి వస్తుంది.

ఏ ఏ క్యాన్సర్లకు ఇది ఉపయోగపడుతుంది? అంటే

ఊపిరితిత్తుల (లంగ్) క్యాన్సర్

తల మరియు మెడ క్యాన్సర్లు

సాఫ్ట్ టిష్యూ మరియు ఎముకల సార్కోమాస్ (Sarcomas)

ప్రస్తుతానికి ZI-MA4-1 కేవలం ఫేజ్ 1 (Phase 1) క్లినికల్ ట్రయల్స్‌లో మాత్రమే ఉంది. ఈ చికిత్స సురక్షితమైనదేనా?,ఇవ్వాల్సిన సరైన మోతాదు (Dose) ఎంత?,ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా?,ఎక్కించిన కణాలు శరీరంలో ఎలా పనిచేస్తున్నాయి? అనే విషయాలను మాత్రమే పరిశీలిస్తున్నారు.ఈ దశలో చికిత్స ఎంతవరకు రోగాన్ని నయం చేస్తుందనేది ప్రధాన లక్ష్యం కాదు. ఇక్కడి ఫలితాలు అనుకూలంగా ఉంటే, ఆ తర్వాత ‘ఫేజ్ 2’, ‘ఫేజ్ 3’ ప్రయోగాలు పూర్తి చేసి, నియంత్రణ సంస్థల (Regulators) అనుమతి పొందిన తర్వాతే సాధారణ వినియోగంలోకి వస్తుంది. ఈ ప్రక్రియకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.

- Advertisement -