సలీం సినిమా నిర్మాణ సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ కేసులో బెయిల్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకుంటున్న సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు మంగళవారం లీగల్ నోటీసులు పంపారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఈ మేరకు మీడియాకు లేఖ విడుదల చేసిన వైవీఎస్ చెక్ బౌన్స్ కేసు తీర్పు అనంతరం మోహన్ బాబు, ఆయన మనుషులు తన స్ధలంలోకి…తనను, తన మనుషులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని చౌదరి ఆరోపించారు.
తాను న్యాయసానాన్ని తప్పుదోవ పట్టించినట్లుగా మోహన్ బాబు ఇటీవల పత్రికా ప్రకటన విడుదల చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అంతేకాకుండా ‘సలీమ్’ చిత్ర నిర్మాణ సమయంలో మోహన్‌బాబు హైదరాబాద్ జల్‌పల్లి గ్రామంలో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, చెక్ బౌన్స్ కేసు కోర్టు తీర్పు అనంతరం నన్ను, నా మనుషుల్ని రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించిందన్నారు.
నా కష్టార్జితంతో కొనుక్కున్న ఇంటి స్థలం విషయంలో మోహన్ బాబు సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం న్యాయనిపుణులను ఆశ్రయించానని తెలిపారు.
ఇదిఇలా ఉండగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపైమోహన్‌బాబు సలీమ్ చిత్రాన్ని నర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రూ. 40,50,000 చెక్‌ను వైవీఎస్‌కు అందించారు మోహన్ బాబు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో వైవీఎస్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దాదాపు 9 సంవత్సరాల అనంతరం ’23వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు’ ఎర్రమంజిల్, హైదరాబాద్‌లో 2 ఏప్రిల్ 2019 మోహన్ బాబుకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.