టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ సెలెక్టర్లకు కీలక సూచన చేశాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను వన్డే జట్టులోకి తరచూ ఎంపిక చేయకపోవడం వారి ప్రతిభకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డాడు. 50 ఓవర్ల ఫార్మాట్లోనూ ఈ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని సూచించాడు.
ప్రోటోకాల్ 32 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పీటీఐతో మాట్లాడిన యువరాజ్.. అభిషేక్ శర్మను వన్డే జట్టులో చూడాలని ఉందని చెప్పాడు. నిజాయతీగా చెప్పాలంటే అభిషేక్ వన్డేల్లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను 50 ఓవర్ల క్రికెట్లో ఎంపిక చేయకపోతే, ఎక్కడో ఒకచోట వారి ప్రతిభకు తగిన న్యాయం చేయనట్లే అని పేర్కొన్నాడు.
అయితే జట్టులో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ ఆటగాళ్లు ఉండటంతో యువ క్రికెటర్లకు అవకాశం కల్పించడం కొంత కష్టమేనని యువరాజ్ అంగీకరించాడు. అయినప్పటికీ యువ బ్యాటర్లు ప్రదర్శిస్తున్న ఆటతీరును చూస్తుంటే త్వరలోనే వారికి జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అభిషేక్ సాధించిన విజయాలన్నీ అతడి కష్టానికి ఫలితమని, ఆ ఘనత పూర్తిగా అతడికే దక్కుతుందని ప్రశంసించాడు.
Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!
అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ చాలాకాలంగా మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అభిషేక్ తరచూ యువరాజ్ నుంచి క్రికెట్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకుంటుంటాడు.ఇదిలా ఉంటే.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 12 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి భారత ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైన టీ20 అంతర్జాతీయ హాఫ్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు.

