దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమా ట్రైలర్ జూలై 30న విడుదలైనప్పటి నుంచి ప్రధాన నటీనటుల ఎంపికపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ చర్చ మరింత పెరిగింది. ముఖ్యంగా సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సాయి పల్లవి అందం, ఆమె హిందీ ఉచ్చారణ, తెరపై కనిపించే తీరు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ చర్చ క్రమంగా ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వైపు కూడా మళ్లింది.
ప్రేమమ్, కలి , అమరన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి సంప్రదాయ సినీ అందాల ప్రమాణాలకు భిన్నంగా ఉంటారు. ముఖంపై మొటిమల మచ్చలు, సహజమైన రూపం కనిపించేందుకు ఆమె వెనుకాడరు. ఆమె పొడవాటి గిరజాల జుట్టుపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. సీతమ్మకు ఇలాంటి జుట్టు ఉంటుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.సాయి పల్లవి మేకప్, లుక్ ఆమె స్థాయికి తగినట్లుగా లేవని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వారి విమర్శలు సాయి పల్లవి నటనపై కాకుండా, ఆమెకు మేకప్ చేసిన కళాకారులు, పాత్ర రూపకల్పన చేసిన చిత్ర బృందంపై ఉన్నాయని అంటున్నారు.
సాయి పల్లవి వ్యక్తిగతంగా అందంగా ఉన్నప్పటికీ, సీత పాత్రలో ఆమె రూపం మాత్రం ఆకట్టుకోవడం లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రావణుడు సీతమ్మను అపహరించడానికి అంతటి ప్రయత్నం చేశాడంటే, ఆమె రూపం అద్భుతంగా ఉండాలనే తమ ఊహకు ఈ లుక్ సరిపోవడం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.మరికొందరు మాత్రం సాయి పల్లవిని ఎంపిక చేయడమే తప్పని, ఆమెకు వేసిన మేకప్ కూడా సరిగా లేదని విమర్శిస్తున్నారు. ఇతర సినిమాల్లో ఆమె కనిపించిన తీరుతో పోలిస్తే రామాయణంలో సీతగా ఆమె లుక్ అంతగా ఆకట్టుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు.
Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి వంటి ఇప్పటికే గుర్తింపు పొందిన నటీనటుల బదులు కొత్తవారిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు. గతంలో వారు పోషించిన పాత్రలు గుర్తుకు వస్తుండటంతో పురాణ గాథలోని రాముడు, సీత పాత్రలతో ప్రేక్షకులు అనుసంధానం కాలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.సీతమ్మ రూపం గురించి ప్రజల్లో ఉన్న ఊహలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. అందుకే ఆమె పాత్రకు ఒకే రూపాన్ని ఖరారు చేయడం కష్టమైన విషయం. సాయి పల్లవి ఎంపికపై వస్తున్న విమర్శలు, ఆమెకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే ఈ అంశం సినిమా విడుదలకు ముందే పెద్ద చర్చగా మారింది.

