ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ యాత్ర. ఈ సినిమలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాల నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమా ఆనందోబ్రహ్మ డైరెక్ట్ చేసిన మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది.
అయితే తాజాగా ఇవాళ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని డైలాగులు విని వైఎస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు బయలురే ముందు ఆయన మాటల్ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో… చరిత్రే నిర్ణయిస్తుంది’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో డైలాగులు వినిపించాయి.
ఈ సినిమాలో వివిధ పాత్రల కోసం డైరెక్టర్ మహి వి రాఘవ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో బాహుబలి ఫేం అశ్రితను, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్రలో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిని, వైఎస్సార్ కూతురు షర్మీల పాత్రలో భూమికను, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసినిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.