ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల (లోకల్ బాడీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కసరత్తు వేగవంతం చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు గానూ 8 మంది సీనియర్ నాయకులతో కూడిన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఈ కీలక కమిటీకి చైర్మన్‌గా కాంగ్రెస్ కార్యవర్గ (CWC) సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి వ్యవహరించనున్నారు. అలాగే, కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్రమంత్రి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం బాధ్యతలు చేపడతారు.
మానిటరింగ్ కమిటీ సభ్యులు:
గిడుగు రుద్రరాజు (CWC సభ్యులు)
ఎం. పల్లంరాజు (మాజీ కేంద్రమంత్రి)
డాక్టర్ కిల్లి కృపారాణి (మాజీ కేంద్రమంత్రి)
మస్తాన్ వలి (ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్)
ఎన్. తులసిరెడ్డి (మాజీ రాజ్యసభ ఎంపీ & ముఖ్య అధికార ప్రతినిధి)
వీరితో పాటు, రాబోయే స్థానిక పోరు కోసం పీసీసీ కో-ఆర్డినేషన్ మరియు సోషల్ మీడియా విభాగం ఇన్‌చార్జిగా నెల్లూరు డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు.
Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం
ఈ కమిటీతో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా పార్టీ బలాలను సమీక్షించుకుంటూ, కార్యకర్తలను సమాయత్తం చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు.

