H1B వీసాదారులకు ట్రంప్ మరో షాక్

1
- Advertisement -

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీ నిపుణులకు ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి ట్రంప్ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. H-1B సహా వివిధ రకాల తాత్కాలిక పని వీసాలపై ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసేందుకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ‘ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్’ పేరుతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ ముసాయిదా ప్రతిపాదనను విడుదల చేసింది.

అమెరికాలో పని చేసే విదేశీ ఉద్యోగులు అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోతే, వారు వేరే కంపెనీలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి లేదా అమెరికాను ఖాళీ చేసి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యే ఏర్పాట్లు చేసుకోవడానికి 2016లో ఒబామా హయాంలో ఈ 60 రోజుల పరిమితిని తీసుకొచ్చారు. ప్రస్తుత కొత్త నిబంధన అమల్లోకి వస్తే, ఉద్యోగం పోయిన మరుసటి రోజు నుంచే ఆయా ఉద్యోగుల వీసా చెల్లుబాటు కాకుండా పోతుంది. కొత్త కంపెనీ స్పాన్సర్‌షిప్ దొరికే వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి గడువూ ఉండదు.

ఈ నిబంధన రద్దు కేవలం H-1B వీసాదారులకే కాకుండా, ఇతర ప్రముఖ వీసా కేటగిరీలకూ వర్తిస్తుంది. ఐటీ మరియు నిపుణులైన విదేశీ ఉద్యోగులు L-1: అంతర్జాతీయ కంపెనీల మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు E-1, E-2, E-3: వ్యాపారవేత్తలు, ఆస్ట్రేలియన్ నిపుణులు O-1: అత్యుత్తమ ప్రతిభ కలిగిన విజ్ఞాన, క్రీడా, కళారంగాల నిపుణులు TN: కెనడా, మెక్సికో దేశాల నిపుణులు అంతేకాకుండా, వీసాదారులపై ఆధారపడి అమెరికాలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు (డిపెండెంట్లు) కూడా వెంటనే తమ హోదాను కోల్పోవాల్సి వస్తుంది.

నిబంధన అమలైతే, కంపెనీ తీసివేసిన మరుసటి రోజే చట్టబద్ధమైన వీసా హోదా ముగుస్తుంది. దీంతో వెంటనే అమెరికాను వీడి స్వదేశానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదు చేసిన తర్వాత 60 రోజుల పాటు ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. హెచ్-1బి వీసాలు ఎక్కువగా పొందుతున్న వారిలో భారతీయులే ముందు వరుసలో ఉన్నందున, ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. అమెరికా పౌరులకే ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యంగా ఇవ్వాలనే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ ముసాయిదాపై ఫైనల్ రూల్ వచ్చే వరకు పాత నిబంధనే అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read:అసెంబ్లీ ఘటనపై ఢిల్లీకి బీఆర్‌ఎస్ బృందం

- Advertisement -