కేంద్ర ప్రభుత్వం ఇటీవల వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) (VB-G-RAM-G) ను ప్రవేశపెట్టింది. ఇది 2005లో యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని భర్తీ చేస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మాట్లాడుతూ, VB-G-RAM-G చట్టం భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది విప్లవాత్మక అడుగు అని అన్నారు.
కేబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..“ఈ VB-G-RAM-G చట్టం వికసిత భారతానికి పునాది వేస్తుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామమే మౌలిక యూనిట్. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, రైతులు స్వావలంబులు అవ్వగా, కార్మికులకు సామాజిక భద్రత, గౌరవం కల్పించినప్పుడు వికసిత భారత్ దిశగా దేశం ముందుకు సాగుతుంది. ఈ చట్టాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ప్రజల తరఫున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
అలాగే, కొందరు వర్గాలు ఎన్నో సంవత్సరాలుగా దేశ వనరులను దోచుకున్నాయని, ఇప్పుడు అదే శక్తులు ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా నిలుస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మరియు ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని, “దేశ వనరులను దోచుకున్న వారే ఈ చట్టాన్ని ప్రశ్నిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా, కృతజ్ఞతలు చెప్పాల్సిందని యోగి సూచించారు. “కేవలం అవినీతిని కాపాడుకోవడానికే ఇండియా కూటమి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది” అని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో గ్రామీణ ఉపాధి పథకాలలో భారీ అవకతవకలు జరిగాయని పేర్కొంటూ, నకిలీ జాబ్ కార్డులు, తప్పుడు హాజరు నమోదు చేశారని, గుంతలు తవ్వి మళ్లీ పూడ్చే పనులే జరిగాయని విమర్శించారు.
Also Read:నేపాల్‌లో మత ఘర్షణలు..ఉద్రిక్తం!

