రవాణా శాఖ ఆదాయ@ రూ.5142 కోట్లు

10
- Advertisement -

రవాణా శాఖ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 9 నెలల ఆదాయ వివరాలను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రవాణా శాఖకు మొత్తం రూ.5,142 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ కాలానికి నిర్ణయించిన రూ.6,165 కోట్ల ఆదాయ లక్ష్యంలో 83 శాతం సాధించామని శాఖ అధికారులు తెలిపారు.

ఆదాయ వనరుల వారీగా చూస్తే, జీవితకాలపు పన్నుల ద్వారా రూ.3,611 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.730 కోట్లు సమకూరాయి. అదనంగా గ్రీన్ టాక్స్ ద్వారా రూ.57 కోట్లు, వివిధ ఫీజుల రూపంలో రూ.408 కోట్లు, తనిఖీల ద్వారా రూ.181 కోట్లు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.153 కోట్లు ఆదాయం లభించినట్లు రవాణా శాఖ వివరించింది. ఈ ఆదాయ వృద్ధి శాఖ పనితీరుకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ బస్సులు అధిక చార్జీలు వసూలు చేసినా, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేసినా, లేదా స్టేజీ క్యారేజీలుగా అక్రమంగా నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.

తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది.

Also Read:బ్రాడ్‌మన్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్!

- Advertisement -