రామ్ మందిర్ విరాళాల వివాదంపై సీఎం యోగి

2
- Advertisement -

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన యోగి ఆదిత్యనాథ్, రామ్ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. అలాగే, ఈ విరాళాల అక్రమాలకు సంబంధించి ఎవరి వద్దనైనా పత్రాల రూపంలో ఆధారాలు ఉంటే వాటిని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) సమర్పించాలని కోరారు.

ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకే ఎస్‌ఐటీ (SIT)ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆయన ఈ దర్యాప్తు ద్వారా అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయోధ్య లేదా శ్రీరామ జన్మభూమి దేవాలయం ప్రతిష్టను దిగజార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు లోనుకావద్దని, శ్రీరాముడి ఆదర్శాలైన సహనం, హుందాతనాన్ని భక్తులు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

గతంలో సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ పార్టీలు రామాలయ ఉద్యమాన్ని వ్యతిరేకించాయని….నాటి ప్రభుత్వాలు రామ్ భక్తులు, కర్ సేవకులపై కఠిన చర్యలు తీసుకున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. అయోధ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని యోగి మండిపడ్డారు. గతంలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన కాంగ్రెస్, ఇప్పుడు అయోధ్యపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.

Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్

కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను ఒకసారి చూడండి. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సాధ్యమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించిన అదే కాంగ్రెస్ పార్టీ….ఇప్పుడు అయోధ్య గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు నటిస్తోంది అని సీఎం అన్నారు. కోర్టుల్లో కూడా కాంగ్రెస్ రామాలయ ఉద్యమాన్ని వ్యతిరేకించిందని, సుప్రీంకోర్టులో శ్రీరాముడు అసలు లేనేలేడంటూ అఫిడవిట్లు సమర్పించిందని ఆయన ఆరోపించారు. అలాంటి పార్టీ ఈరోజు రామ్ భక్తులను అవమానించారంటూ అల్లాడిపోతోందని ఎద్దేవా చేశారు.

రామ్ భక్తుల పట్ల సమాజ్‌వాదీ పార్టీ చూపిస్తున్న కపట ప్రేమను కూడా యోగి ఆదిత్యనాథ్ తప్పుపట్టారు. “ఈరోజు రామ్ భక్తులను అవమానించారని వారు మాట్లాడుతున్నారు కానీ గతంలో ‘జై శ్రీరామ్’ అని నినదించిన కర్ సేవకులపై తూటాల వర్షం కురిపించి, లాఠీఛార్జ్ చేయించింది వీళ్లే. ఇప్పుడు వీరు వచ్చి ఇతరులకు నీతులు చెబుతున్నారు అని ధ్వజమెత్తారు.

- Advertisement -